గ్రానైట్‌పై విద్యుత్తు పిడుగు

‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’

Updated : 01 Dec 2023 05:55 IST

ఆందోళనలో యజమానులు

మార్టూరు ప్రాంతంలో ఏర్పాటైన ఓ గ్రానైట్‌ పరిశ్రమ

న్యూస్‌టుడే, మార్టూరు, యద్దనపూడి: ‘బాపట్ల జిల్లా మార్టూరులో 400, బల్లికురవలో 200, సంతమాగులూరులో 90, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 120, ప్రకాశం జిల్లాలో 800 వరకు గ్రానైట్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి.’

ఇప్పటికే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న గ్రానైట్‌ పరిశ్రమపై పెరిగిన విద్యుత్తు ధరలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారాయని యజమానులు ఆందోళన చెందుతున్నారు. ముడి రాయి కొరత, పతనమైన పలకల ధరలతో సతమతమవుతుండగా విద్యుత్తు ఛార్జీలతో బెంబేలెత్తుతున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విధానంపై అవగాహన కల్పించకపోవడం.. ప్రతి యంత్రానికి ఏర్పాటు చేసిన కెపాసిటర్‌ వంటి ఆధునిక పరిజ్ఞాన వినియోగం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన చెందుతున్నారు. గతనెల రూ.లక్ష వచ్చిన గ్రానైట్‌ యూనిట్‌కు ప్రస్తుతం రూ.1.74 లక్షల బిల్లు వస్తోందని పరిశ్రమ వర్గాలు వాపోతున్నాయి.

గ్రానైట్‌ పరిశ్రమలో అన్ని యంత్రాలు నడిపేందుకు ప్రధాన భూమిక పోషించేది ప్యానెల్‌ బోర్డు. ఇప్పటి వరకు ప్యానెల్‌ బోర్డుకు మాత్రమే కెపాసిటర్లను ఏర్పాటుచేసి కిలోవాట్స్‌ రీడింగ్‌ను విద్యుత్తు శాఖ అధికారులు గుర్తించేవారు. మారిన విధివిధానాలకు అనుగుణంగా పరిశ్రమలోని ప్రతి యంత్రానికి ఒక కెపాసిటరు ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాక విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు.. యజమానులు, పరిశ్రమ సిబ్బందిలో అవగాహన పెంపొందించలేదని, ఎవరో వచ్చి కెపాసిటర్లను బిగించడంతో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. వీటి ఫలితంగా యంత్రాలు పనిచేయని సమయంలోనూ విద్యుత్తు రీడింగ్‌ నమోదవుతోందని అంటున్నారు. 

ప్రస్తుతం పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా  ఈ నెల వచ్చిన రూ.1,74,743 బిల్లు

హామీలు నీటి మూటలుగా..

వైఎస్‌ జగన్‌ ప్రతిపక్ష నేతగా 2019కి ముందు చేపట్టిన పాదయాత్రలో అప్పటి ప్రకాశం జిల్లాలోని గ్రానైట్‌ యజమానులు చీమకుర్తిలో జగన్‌ను కలిసి, సంక్షోభంలో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమ సమస్యలు వివరించారు. అధికారం చేపట్టగానే సమస్యలు పరిష్కరించి, న్యాయం చేస్తానని వారికి నాడు హామీ ఇచ్చారు. అంతేకాక విద్యుత్తు యూనిట్‌కి రూ.3.50 ధర తగ్గించి, రాయితీ కల్పిస్తానని ఇచ్చిన హామీ నీటి మూటచందంగా మారిందని పరిశ్రమ వర్గం మిన్నకుండిపోయింది. విద్యుత్తు ఛార్జీలు తగ్గించకపోగా, జగన్‌ సర్కార్‌ యూనిట్‌కి రూ.2 తగ్గిస్తూ ఇచ్చిన జీవో ఇప్పటికీ అమలుకాలేదని, ప్రస్తుతం రూ.9 చెల్లించడం పరిశ్రమ మనుగడుకే కష్టంగా మారిందని ఆవేదన చెందుతున్నారు.

యూజర్‌ ఛార్జీ ఒక రూపాయి వసూలు

గ్రానైట్‌ పరిశ్రమలో ఒక యూనిట్‌ ఖర్చు చేస్తే ఇందుకు ఆరు పైసలను యజమానులు విద్యుత్తు శాఖకు చెల్లించాల్సి ఉంది. కానీ ఎక్కువ సంఖ్యలో పరిశ్రమల నుంచి ఆ శాఖ రూపాయి వరకు వసూలు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అదనపు భారాన్ని మోయలేని కొందరు యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారికి మాత్రం ఆరు పైసలు వెసులుబాటు కలుగుతోంది. మిగిలినవారు అదనపు భారాన్ని భరిస్తున్నారు.


ఛార్జీలు తగ్గించాలి

ప్రస్తుతం గ్రానైట్‌ పరిశ్రమలపై ప్రభుత్వం మోపిన విద్యుత్తు ఛార్జీలు పెనుభారమయ్యాయి. పరిశ్రమలు మూతపడే దిశగా మారాయి. ప్రభుత్వం పునరాలోచించి పారిశ్రామిక వర్గాలకు తోడ్పాటుగా నిలవాలి. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కెపాసిటర్ల స్థానంలో ఆటో ప్యానెల్‌ ఏర్పాటుచేసి యజమానులను ఆదుకోవాలి. ఈ నూతన విధానంపై యజమానుల్లో అవగాహన పెంపొందించి, రాయితీలు కల్పించాలి.

ఇంటూరు ఆంజనేయులు,  గౌరవాధ్యక్షుడు, గ్రానైట్‌ యజమానులు సంక్షేమ సంఘం


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

గ్రానైట్‌ యజమానులు అదనపు కరెంటు ఛార్జీలపై తమ సమస్యలను వివరిస్తే పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. కరెంటు వినియోగానికి మించి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదు. సాంకేతికపరంగా ఇబ్బందులు తలెత్తితే సరిచేస్తాం. ఎవరికైన అదనంగా బిల్లులు వస్తే తమ దృష్టికి తీసుకురావాలి.

నల్లూరి మస్తాన్‌రావు, విద్యుత్తు డీఈఈ, అద్దంకి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని