ఆ సంతకం వెనుక మతలబేమిటో!

మైనింగ్‌ సీనరేజీ నగదు పంపిణీలో ఇన్‌ఛార్జి డీపీవోగా వ్యవహరించిన ఓ అధికారి తన పరిధి దాటి వ్యవహరించారు.

Updated : 03 Mar 2024 06:22 IST

ఒక ఊరి ఆదాయం మూడు గ్రామాలకు
సీనరేజీ పంపిణీలో పరిధి దాటి వ్యవహరించిన అధికారి

జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం

మైనింగ్‌ సీనరేజీ నగదు పంపిణీలో ఇన్‌ఛార్జి డీపీవోగా వ్యవహరించిన ఓ అధికారి తన పరిధి దాటి వ్యవహరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఓ పంచాయతీకి చెందిన రూ.కోట్ల సీనరేజీ ఆదాయాన్ని మరో మూడు గ్రామాలకు పంచాలంటూ ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఉన్నతాధికారి అనుమతి లేకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక సదరు అధికారికి రూ.లక్షల్లో ముడుపులు ముట్టాయని పంచాయతీరాజ్‌ వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ పంచాయతీ ఆదాయాన్ని మరో మూడింటికి పంచాలని ఉత్తర్వులు జారీ చేయటం అన్యాయమంటూ సర్పంచి న్యాయపోరాటానికి దిగారు.

న్యూస్‌టుడే, బాపట్ల

జిల్లాలో గత జులై నుంచి సెప్టెంబరు వరకు రెండో త్రైమాసికంలో మైనింగ్‌ సీనరేజీ కింద రూ.15.01 కోట్ల ఆదాయం వచ్చింది. నిబంధనల ప్రకారంలో ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జిల్లా పరిషత్తులకు కేటాయించాలి. గ్రానైట్ క్వారీలు అధికంగా ఉన్న బల్లికురవ మండలంలో జిల్లాలో అత్యధికంగా రూ.5.66 కోట్ల సీనరేజీ ఆదాయం వచ్చింది. కొణిదెన పంచాయతీ పరిధిలో జరిగిన గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి 2023-24 ఏడాదికి సంబంధించి రూ.3.89 కోట్ల సీనరేజీ ఆదాయం నిధులను గనుల శాఖ విడుదల చేసింది. పంచాయతీ ఖాతాలో మొదటి త్రైమాసికం కింద గత అక్టోబరు 3న రూ.47.27 లక్షలు, రెండో త్రైమాసికం కింద రూ.46.53 లక్షలు, మూడో త్రైమాసికం కింద రూ.46.81 లక్షలను జనవరి 11న అధికారులు జమ చేశారు. మూడు విడతల్లో కొణిదెన పంచాయతీకి సీనరేజీ ఆదాయం కింద రూ.1.40 కోట్లు విడుదలైంది. సీనరేజీని పంచాయతీల వారీగా వసూలు చేసినట్లు డీపీవోకు గనుల శాఖ అధికారులు గత జనవరిలో స్పష్టం చేశారు.

  • డీపీవోగా ఉన్న రాంబాబు గత నెల చివరి వారంలో బదిలీ అయ్యారు. మరో శాఖకు చెందిన ఓ జిల్లా అధికారి రెండు వారాలకు పైగా ఇన్‌ఛార్జి డీపీవోగా వ్యవహరించారు. అధికార పార్టీ నేతల కన్ను సీనరేజీ ఆదాయంపై పడింది. ఇన్‌ఛార్జి డీపీవోగా వ్యవహరిస్తున్న అధికారి తమ ప్రాంతంలో పని చేసి రావటంతో వెంటనే జిల్లా కేంద్రానికి వచ్చి ఆయనతో మాటలు కలిపారు. పంచాయతీ వారీగా వచ్చిన సీనరేజీ ఆదాయాన్ని రెవెన్యూ గ్రామం కింద వచ్చినట్లు చూపి మరో మూడు పంచాయతీలకు పంచాలని కోరారు. దీనికి అంగీకారం తెలిపినందుకు సదరు అధికారికి రూ.లక్షల్లో ముట్టజెప్పారు. ఓ పంచాయతీకి విడుదల చేసిన సీనరేజీ ఆదాయాన్ని మిగతా పంచాయతీలకు పంచాలంటే కలెక్టర్‌ అనుమతి కావాలి. ఆ తర్వాతే ఆదేశాలు జారీ చేయాలి.
  • కొణిదెన పంచాయతీ సీనరేజీ ఆదాయాన్ని మరో మూడు గ్రామాలకు పంచే విషయంపై దస్త్రాన్ని మాత్రమే కలెక్టర్‌కు పంపించారు. జిల్లా పాలనాధికారి నుంచి ఎలాంటి ఆదేశాలు, అనుమతి లేకుండానే ఆయన ఆదేశాల మేరకంటూ ఇన్‌ఛార్జి డీపీవోగా ఉన్న సదరు అధికారి గతంలో మూడు విడతల్లో కొణిదెన పంచాయతీ ఖాతాలో జమ చేసిన రూ.1.40 కోట్ల సీనరేజీ ఆదాయం నుంచి కె.మల్లాయపాలేనికి రూ.44.99 లక్షలు, నక్కబొక్కలపాడుకు రూ.37.95 లక్షలు, కె.రాజుపాలేనికి రూ.23.89 లక్షలు చొప్పున పంచాలంటూ పంచాయతీ కార్యదర్శికి ఫిబ్రవరి 17న ఉత్తర్వులు జారీ చేశారు. మూడు పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో పంచిన నిధులు జమ చేసి సమాచారాన్ని డీపీవో కార్యాలయానికి పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై కొణిదెన పంచాయతీ సర్పంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో జరిగిన గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి విడుదల చేసిన సీనరేజీ ఆదాయం వాటా నిధులను మరో మూడు గ్రామాలకు ఎలా పంచుతారంటూ ప్రశ్నించారు. ఇన్‌ఛార్జి డీపీవో జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవంటూ న్యాయపోరాటానికి దిగారు. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై ప్రస్తుత బాపట్ల డీపీవో రవికుమార్‌ మాట్లాడుతూ ఆ ఉత్తర్వుల విషయం నాకు తెలియదు. నేను ఇటీవలే డీపీవోగా బాధ్యతలు స్వీకరించా. సీనరేజీ నిధుల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు