AP News: ఈ నంబరు కాదు... ఆ నంబరు! వాలంటీర్ల మరో ఎత్తుగడ

ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి.

Published : 18 Mar 2024 07:12 IST

ఈనాడు, విశాఖపట్నం: ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొందరు వాలంటీర్లు కొత్త ఎత్తుగడ వేశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ‘వార్డు వాలంటీర్లను ఏ రూపంలోనూ ఎన్నికల విధుల్లో వినియోగించకూడదు. ఎన్నికల ప్రక్రియకు వారిని దూరంగా ఉంచాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం చర్యలు తప్పవు’ అనే హెచ్చరికలు ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా చోట్ల వాలంటీర్లు వైకాపా స్థానిక నాయకులతో సన్నిహితంగా వ్యవహరిస్తూ సంబంధిత వాట్సప్‌ గ్రూపుల్లో చురుగ్గా ఉంటున్నట్లు సమాచారం. ప్రతి వాలంటీరు క్లస్టరు వారీగా 50 ఇళ్ల పరిధిలో పనిచేస్తున్నారు. వీరు వాట్సప్‌ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడితో ఆయా విధులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. నగరంలో దాదాపు పది వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ఇప్పటికే వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాట్సప్‌ గ్రూపుల నుంచి తప్పుకోవాలి. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే కొందరు ఆయా గ్రూపుల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లు చెబుతూ సందేశాలు, వాయిస్‌ రికార్డులు పోస్టు చేశారు. ఇంతవరకు బాగున్నా...వెంటనే మరో కథ ఆరంభమయింది. ‘ఈ నెంబరుకు ఎవరూ ఫోన్‌ చేయొద్దు. ఏదైనా అవసరం ఉంటే మరో నెంబర్‌లో సంప్రదించండి’ అని కొత్త నెంబర్లు ఇస్తున్నారు. ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆ నంబరుకే ఫోన్‌ చేయాలని సూచిస్తున్నారు. కొందరు వాలంటీర్లు నేతలకు దూరంగా ఉన్నా మరికొందరు మాత్రం వైకాపా జెండాలు పట్టుకొని వీరవిధేయత చూపుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వైకాపా నేతల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ ప్రజలను సన్నద్ధం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని