వినియోగదారులకు రెట్టింపు షాక్‌

ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది.

Updated : 19 Apr 2024 05:13 IST

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. ఈసారి ఛార్జీల రూపంలో కాకుండా విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు, పరికరాల ధరలను భారీగా పెంచేసింది. మూడు నెలల కిందట ఉన్న ధరలు ప్రస్తుతం రెట్టింపయ్యాయి.   వ్యవసాయ, వాణిజ్య వినియోగదారులతో పాటు సామాన్యులపైనా భారం పడనుంది.

పరికరాలూ కొనలేం

విద్యుత్తు నియంత్రికల ధరలే కాకుండా స్తంభాలు, అనుబంధ పరికరాల ధరలు కూడా ఇష్టానుసారం పెంచారు. విద్యుత్తు స్తంభం ధర రూ.2,500 నుంచి రూ.4 వేలకు పెరిగింది. గతంలో ఎనిమిది మీటర్ల స్తంభం ధర రూ.1,900 ఉంటే ప్రస్తుతం రూ.3,200కు పెరిగింది. సాధారణంగా స్తంభాల ధరలు వేసవిలో కొంత వరకు పెరుగుతాయి. సిమెంటు ధరలు పెరగడం, క్యూరింగ్‌కు ఎక్కువగా విద్యుత్తు అవసరం కావడం వల్ల ధరలు పెంచుతారు. కాని 80 శాతం వరకు ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యుత్తు నియంత్రిక అమర్చాలంటే 120 రకాల అనుబంధ పరికరాలు అవసరం అవుతాయి. వీటి ధరలు కూడా వందశాతం వరకు పెరిగాయి.

90 రోజుల్లో  రూ.95 వేల పెంపు

ఉమ్మడి జిల్లా పరిధిలోని కర్నూలు సర్కిల్‌లో అన్ని విభాగాల్లో కలిపి విద్యుత్తు సర్వీసులు 15,02,667 ఉన్నాయి. 82 విద్యుత్తు ఫీడర్ల కింద సబ్‌స్టేషన్లు ఉన్నాయి. సింగిల్‌ ఫేజ్‌, త్రీఫేజ్‌ నియంత్రికలు సుమారు 1.82 లక్షలు ఉన్నాయి. మూడు నెలల కిందట త్రీఫేజ్‌ 25 కేవీ నియంత్రిక ధర రూ.80 వేల వరకు ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.1.75 లక్షలకు చేరింది. 90 రోజుల్లోనే రూ.95 వేలు పెరగడం గమనార్హం. ఇదే సమయంలో అనుబంధ పరికరాలు, విద్యుత్తు స్తంభాల ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలతో గృహ, వ్యవసాయ, వాణిజ్య విద్యుత్తు వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

బాదుడే... బాదుడు

వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకుంటే 10 హెచ్‌పీ సామర్థ్యానికి సంబంధించి రూ.12,400 చెల్లించాలి. ఈ మొత్తానికి 25 కేవీ నియంత్రిక, మూడు స్తంభాలు, 180 మీటర్ల పొడవైన మూడు లైన్ల తీగలు ఇస్తున్నారు. దూరం ఎక్కువ ఉంటే అందుకయ్యే ఖర్చు మొత్తం సంబంధిత రైతే చెల్లించాలి. గృహ, వాణిజ్య సర్వీసులకు సంబంధించిన మొత్తం భారం వినియోగదారులే భరించాలి. ముందుగా వినియోగదారు దరఖాస్తు చేసుకుంటే విద్యుత్తు సిబ్బంది వచ్చి దూరం చూసి అవసరమయ్యే స్తంభాలు, తీగలకు ఎంతవుతుందో అంచనా వేసి మొత్తం చెబితే ఆ మేరకు డబ్బు చెల్లించాలి. దగ్గర్లో నియంత్రిక ఉంటే ఖర్చు తగ్గుతుంది. నియంత్రిక లేకపోయినా, స్తంభాలు లేకపోయినా రూ.వేలల్లో భారం వినియోగదారులే భరించాలి. దీంతో ప్రస్తుతం వాణిజ్య, గృహ సర్వీసుల ఖర్చులు చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

అదనపు భారం రూ.8 కోట్లు

జిల్లా పునర్విభజన జరిగినా కూడా విద్యుత్తు శాఖ ఉమ్మడిగానే ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా సర్కిల్‌ మొత్తానికి కర్నూలు స్టోర్‌ నుంచే నియంత్రికలు, పరికరాలన్నీ సరఫరా అవుతాయి. ఏటా ఈ గోదాము నుంచే రూ.40 కోట్ల విలువ చేసే సుమారు 2,500 25 కేవీ నియంత్రికలు సరఫరా అవుతున్నాయి. 63 కేవీ 300 వరకు, 100 కేవీ సామర్థ్యం ఉన్నవి 200 వరకు పంపిణీ చేస్తున్నారు. 160 కేవీ నియంత్రికలు మరో 250 వరకు అందజేస్తున్నారు. పెరిగిన ధరలతో ఏడాదికి రూ.8 కోట్ల వరకు అదనపు భారం ప్రజలపై పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని