ఆటపాటలే ఆనందం..

ఈ రోజుల్లో వివిధ రకాల స్క్రీన్‌లు చూస్తూ గంటలకొద్దీ సమయం గడుపుతున్నారు పిల్లలు. తద్వారా అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీనికన్నా రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశం వైపు చూడాలంటున్నారు నిపుణులు.

Updated : 21 Apr 2024 06:27 IST

అశ్వాపురం, పాల్వంచ, న్యూస్‌టుడే

ఈ రోజుల్లో వివిధ రకాల స్క్రీన్‌లు చూస్తూ గంటలకొద్దీ సమయం గడుపుతున్నారు పిల్లలు. తద్వారా అనేక దుష్ప్రభావాలు కలుగుతున్నాయి. దీనికన్నా రాత్రిపూట ఆరుబయట పడుకుని ఆకాశం వైపు చూడాలంటున్నారు నిపుణులు. నక్షత్రాలు, చంద్రుడు, మేఘాల కదలికలను  గమనించటం వల్ల ఎంతో హాయిగా ఉంటుందని చెబుతున్నారు. దీనివల్ల మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని అభిప్రాయపడుతున్నారు.

పాఠశాల విద్యార్థులకు వేసవి సెలవులు బుధవారం మొదలుకానున్నాయి. మరోవైపు ఎండలు మండుతున్నాయి. ఎండలో తిరిగితే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, ఇంటి పట్టునే నీడలో స్నేహితులతో కలిసి ఆడుకుంటే మానసికోల్లాసం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

పుస్తక పఠనంతో సృజనాత్మకత

పిల్లల కోసం ప్రత్యేకంగా బొమ్మల కథల పుస్తకాలు సేకరించగలిగితే వారు ఇంటి పట్టునే ఉండి వాటితో కాలం గడుపుతారు. తద్వారా ఊహలు, భావనలు పెంపొందుతాయి. పఠనంపై ఆసక్తి కలుగుతుంది. చిక్కు ప్రశ్నలు, పొడుపు కథలు అయితే వారిలో ఉత్సుకతను కలిగిస్తాయి. మెదడుకు మేతతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయి.

ఆసక్తి ఉండాలే కానీ..

బోలెడన్ని ఇండోర్‌ గేమ్స్‌ ఉన్నాయి. షాపుల్లో వాటి కిట్లు లభిస్తాయి. క్యారమ్స్‌, చెస్‌, లూడో, బౌలింగ్‌, స్నేక్‌ అండ్‌ ల్యాడర్‌, కార్డ్‌ గేమ్స్‌, బ్రెయిన్‌ విటా వంటి ఆధునిక గేమ్స్‌ మెదడుకు మేత, మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అందుబాటులో క్రీడా మైదానాలు ఉంటే సాయంత్రం పూట స్నేహితులలో కలిసి బాల్‌ బాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ వంటి ఆటలు ఆడవచ్చు. శారీరక వ్యాయామం చేసినట్టవుతుంది. దాగుడుమూతలు, దొంగ పోలీస్‌, డాగ్‌ అండ్‌ బోన్‌, టగ్‌ ఆఫ్‌ వార్‌, ఉయ్యాల జంపాల, తొక్కుడు బిళ్ల, బిళ్లం గోనె, గోళీలు, త్రో బాల్‌ వంటి సంప్రదాయ ఆటలను చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. కలివిడితనాన్ని ఈ ఆటలు నేర్పుతాయి. కుట్టు, అల్లికలు, గానం, నృత్యం, కరాటే, పెయింటింగ్‌, చేతిరాత వంటి అంశాలపై శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంటారని, కాసింత నైపుణ్యం సాధించడానికి వేసవి సెలవులు సరిపోతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

1 నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు

ఖమ్మం:  82,732
భద్రాద్రి:  76,415


ఇటు వినోదాత్మకం.. అటు వ్యాయామం

సాయంత్రం పూట పిల్లలకు తోటపని అలవాటు చేయాలి. వివిధ రకాల మొక్కలు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుంటారు. పిల్లలకు ఇది వినోదాత్మక విద్యతో పాటు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. పక్షుల కోసం ప్రత్యేకంగా పాత్రలు ఏర్పాటుచేయటం, వాటిని నిత్యం నీటితో నింపటం, గింజలను పెట్టడం వంటివి నేర్పించవచ్చు. పక్షుల అలవాట్లు, పద్ధతులను గమనించగలిగితే వారి మనసుకు ఎంతో హాయి, ఉల్లాసం కలుగుతాయి.


ఇంకేమైనా చేయాలనుకుంటే..

కామిక్‌ పుస్తకాలు రాయవచ్చు. వివరించవచ్చు. ఆటపాటలతో కొన్ని తేలికైన సైన్స్‌ ప్రాజెక్టులు చేపట్టవచ్చు. శాస్త్రీయ, కళాత్మక స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రాఫ్ట్‌ కార్యక్రమాలు దోహదపడతాయి. మార్బుల్స్‌కు పెయింట్‌ వేయవచ్చు. వాల్‌ కలర్‌ చాక్స్‌తో గోడచిత్రాలు గీయవచ్చు. రాక్‌ పెయింటింగ్‌ చేయవచ్చు. వివిధ ఆకారాలు, పరిమాణాల ఆకులు, పువ్వులు సేకరించి చిత్తు పుస్తకాల్లో నొక్కి ఉంచి తరవాత వాటితో హెర్చేరియం తయారుచేయవచ్చు.


పిల్లలు మానసికంగా ఎదగటానికి చదువుతో పాటు ఆటలు ముఖ్యం. ఈరోజుల్లో ఆడుకోవటం తగ్గుతోంది. చిన్నతనంలో ఆడే ఆటలతో పిల్లల్లో మానసిక పరిపక్వత ఏర్పడుతుంది.

డాక్టర్‌ టి.ఆనంద్‌, సైకాలజిస్ట్‌, భద్రాచలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని