పట్టాలెక్కని ప్రతిపాదనలు

ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

Updated : 23 Apr 2024 05:50 IST

ఉమ్మడి జిల్లాలో రైల్వే అభివృద్ధికి అడుగులు పడితేనే సగటు జీవికి ఊరట

ఈనాడు, పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త రైళ్ల ప్రారంభం, హాల్టింగ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేలా నేతలు చొరవ చూపాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, వరంగల్‌, హైదరాబాద్‌ వంటి నగరాలు, ఇతర రాష్ట్ర్రాలకు వెళ్లే రైళ్లకు హాల్టింగ్‌లు కల్పించడంతో పాటు కేటాయింపులు పెంచాలని విన్నవిస్తున్నారు. పెద్దపల్లి-నిజామాబాద్‌, కాజీపేట-బల్లార్షా మార్గాల్లో రైళ్లను పొడిగించాల్సి ఉంది. కరీంనగర్‌ నుంచి దిల్లీ, ఆగ్రా, మధుర, నాగ్‌పూర్‌ ప్రాంతాలకు నిత్యం వాణిజ్య అవసరాలపై వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉంటారు. పేద, మధ్యతరగతి వర్గాల సంపాదనలో 5 శాతం ప్రయాణ ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. పెరిగిన బస్సు ఛార్జీల కంటే చవకయిన రైలు ప్రయాణం అందరికీ అందుబాటులోకి వచ్చేలా నేతలు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఇవీ అవసరాలు..

  • కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంపర్క్‌ క్రాంతి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తుండగా తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లవుతున్నా ఆ రైలు ఊసే లేదు. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌-కరీంనగర్‌-పెద్దపల్లి మార్గంలో దిల్లీకి రైలు నడిపించాలన్న విజ్ఞప్తులు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి.
  • తెలంగాణ, జీటీ, కేరళ ఎక్స్‌ప్రెస్‌లకు జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్‌లలో హాల్టింగ్‌ కల్పిస్తే ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.  ్య గోవా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌, కాశీ తమిళ సంగమం వీక్లీ, అయోధ్య-రామేశ్వరం, పూరి-ఓఖా వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ రైళ్లను నిలిపితే కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల వ్యాపారులకు, పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది.
  • కరీంనగర్‌-తిరుపతి బై వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ను ఓదెల, సుల్తానాబాద్‌, ఉప్పల్‌ స్టేషన్‌లలో నిలపడంతో పాటు ప్రతి రోజూ నడుపుతూ నిజామాబాద్‌ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
  • నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి మీదుగా వరంగల్‌ వరకు పుష్‌పుల్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజూ నడిపిస్తే వేలాది మందికి ప్రయోజనం ఉంటుంది. ఈ మార్గంలో ప్రతి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నా ప్రయాణ సమయం అధికంగా ఉంటోంది.
  • పెద్దపల్లి, ఓదెల, జమ్మికుంటల నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ఉదయం 6 తర్వాత భాగ్యనగర్‌ తప్ప మరో రైలు లేదు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు అనుకూలంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఇంటర్‌సిటీ, పుష్‌పుల్‌ రైళ్లను నడపాలన్న డిమాండ్లు దశాబ్ద కాలంగా ఉన్నాయి.
  • కాజీపేట-బల్లార్షా మార్గంలో నూతన ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించి సికింద్రాబాద్‌ నుంచి కోల్‌కతా వరకు నడిపించాలని పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌కు వెళ్లాలంటే వరంగల్‌కు వెళ్లి ఈస్ట్‌ కోస్ట్‌లో ప్రయాణించాల్సి వస్తోంది.
  • జగిత్యాల జిల్లా నుంచి ముంబయి వెళ్లే వారు అధిక సంఖ్యలో ఉంటుండటంతో కరీంనగర్‌ మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు నిలపాలన్న డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం కరీంనగర్‌ వరకు నడుస్తున్న రైలును సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ వరకు పొడిగించాల్సి ఉంది.
  • పెద్దపల్లి-కరీంనగర్‌-నిజామాబాద్‌ మార్గంలో డబ్లింగ్‌ పనులు చేపట్టడం ద్వారా ప్రయాణ రైళ్ల సంఖ్య పెరిగి శిరిడీ, గుజరాత్‌లకు త్వరగా చేరుకోవచ్చు.

అహ్మదాబాద్‌ నుంచి లఖ్‌నవూ వెళ్లే నవజీవన్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ జనరల్‌ బోగీలో కిక్కిరిసిన ప్రయాణికులు

స్టేషన్‌ల ఆధునికీకరణే ప్రధానం

పెద్దపల్లి జంక్షన్‌ను ఆర్‌పీఎఫ్‌ను కేటాయించడంతో పాటు క్య్రూలాబీని కూడా ఏర్పాటు చేసి పోలీసులకు సదుపాయాలు, లిఫ్ట్‌, ఎస్కలేటర్‌ సౌకర్యం ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనలు అమలు కావడం లేదు. స్మార్ట్‌ సిటీగా పేరొందిన కరీంనగర్‌ స్టేషన్‌లో మరో రెండు ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేసి రైళ్లు పెంచాలి. కరీంనగర్‌, జగిత్యాల స్టేషన్‌లలో 24 రైల్వే కోచ్‌ వెడల్పుతో నూతన పిట్‌లైన్‌ను ప్రకటించాలి. కోరుట్ల స్టేషన్‌లో నూతన సరకు రవాణా షెడ్డును, కొండగట్టు వద్ద నూతన స్టేషన్‌ను మంజూరు చేయాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వేములవాడకు రైళ్ల రాకపోకలు పెంచాలి.

‘కోల్‌ కారిడార్‌’తో బహుళ ప్రయోజనాలు

రామగుండం నుంచి మంథని, భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు 199 కిలోమీటర్ల మేర గతంలో ప్రస్తావించిన ‘రైల్వే కోల్‌కారిడార్‌’ ఏర్పాటుతో సరకు రవాణాకు, ప్రయాణికుల రాకపోకలకు అనువుగా ఉంటుంది. మేడారం జాతరతో పాటు రామప్ప, లక్నవరం వంటి పర్యాటక స్థలాలకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది. పెద్దపల్లి-నిజామాబాద్‌ మార్గంలో 177 కిలోమీటర్ల మేర డబుల్‌ ట్రాక్‌ ఏర్పాటుతో సరకు రవాణా వేగవంతంగా జరుగుతుంది. వేములవాడ సమీపంలోని కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన మార్గానికి భూ సర్వే వేగవంతంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తేవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని