వంగిపోయారా? లొంగిపోయారా?

ఎన్నికల పోలింగ్‌  అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు.

Updated : 19 May 2024 05:46 IST

కడపలో రాళ్లదాడిపై పోలీసుశాఖ అంతర్మథనం 
ఘటనపై ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ తీవ్ర ఆగ్రహం 
ఆరుగురు అధికారులపై చర్యలకు కసరత్తు

జమ్మలమడుగు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్పీ సిద్ధార్ధ కౌశల్, ఇతర పోలీసు అధికారులు 

ఎన్నికల పోలింగ్‌  అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్‌ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్‌ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 13న పోలింగ్‌ రోజు రాత్రి వైకాపా కీలక నేతలే కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కడప నగరంలోని గౌస్‌ నగర్‌లో రాళ్లు రువ్వడంతో తెదేపా శ్రేణులు ప్రతిగా స్పందించాయి. ఈ వ్యవహారం తీవ్ర సంచలనం కలిగించింది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వాస్తవాలు తెలుసుకున్న ఎస్పీ నష్ట నివారణకు ఉపక్రమించారు. 

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, కడప నేర విభాగం: కడప నగరంలోని గౌస్‌ నగర్‌లో పోలింగ్‌ రోజు రాత్రి వైకాపా, తెదేపా వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. వైకాపా నేతలు దగ్గరుండి దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో అడ్డుకునేందుకు తెదేపా నేతలు, కార్యకర్తలు అక్కడకు వెళ్లగా వైకాపా రాళ్ల దాడికి పాల్పడింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా సమక్షంలోనే వైకాపా శ్రేణులు రాళ్ల వర్షం కురిపించారు. అంజాద్‌ బాషా వాహనం ఎక్కి కేకలు వేయడం, ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా ప్రయత్నించడంతో వారి పార్టీ శ్రేణులు మరింతగా రెచ్చిపోయారు. ప్రతిగా తెదేపా కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ గొడవ దాదాపు రెండు గంటల పాటు రాత్రి సమయంలో ప్రధాన రహదారి మధ్యలో జరిగినా పోలీసులు చేష్టలుడికి చూస్తున్నారు. కనీసం నిలువరించే ప్రయత్నం సైత చేయలేదు. అదే రోజు సాయంత్రమే మేకలదొడ్డి పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు రెండు పార్టీల మధ్య కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా ముందస్తుగా పోలీసులను మోహరించకపోవడం, కేంద్ర బలగాలను వినియోగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప సున్నితమైన ప్రాంతం కావడం, రెండు పార్టీల మధ్య రెండు/ మూడు నెలల నుంచి గొడవలు జరుగుతున్న తరుణంలో పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించారనే అపవాదు ఉంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు ఘర్షణలను నిలువరించలేకపోగా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. దీంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని గుర్తించి ఒకటో పట్టణ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌.ఐ.రంగస్వామి, తాలుకా, చిన్నచౌక్, రిమ్స్, టూటౌన్‌ ఎస్‌.ఐ.లు తిరుపాల్‌ నాయక్, మహమ్మద్‌ రఫీ, ఎర్రన్న, మహ్మద్‌ అలీఖాన్‌లకు ఛార్జిమెమోలు జారీ చేశారు. వీరందరిపై సమగ్ర విచారణ చేపట్టి వైఫల్యాల స్థాయిని బట్టి చర్యలకు సిఫార్సు చేయాలని విచారణ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఒకట్రెండు రోజుల్లో చర్యలకు కసరత్తు జరుగుతోంది. కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ షరీఫ్‌ను ఉపేక్షిస్తూ వదిలిపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్పీ శనివారం రాత్రి జమ్మలమడుగు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

కౌంటింగ్‌ కేంద్రం వద్ద 144 సెక్షన్‌

కడప నగరంలోని కౌంటింగ్‌ కేంద్రం వద్ద వచ్చే నెల 4 వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్ధకౌశల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కడప శివారులోని మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ ఉర్దూ విశ్వ విద్యాలయంలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో సమీక్షించారు. మరోవైపు నిఘా వర్గాల హెచ్చరికలను ప్రస్తావించారు. గెలుపొందిన అభ్యర్థులు నగరంలో ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించరాదనే ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని