వీడియోలు చూసి.. చోరీ చేసి

ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు.

Published : 21 May 2024 06:42 IST

నగరంలో నేపాలీ దంపతుల పథకం
పని మనుషులుగా చేరి దోపిడీ 

ఈనాడు, హైదరాబాద్‌ రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. నగరానికి వచ్చి పనివాళ్లుగా ఇంట్లోకి చేరారు. అదను చూసి చోరీ చేసి పారిపోయారు. సికింద్రాబాద్‌లో గత నెల 30న జరిగిన దొంగతనం కేసులో రాంగోపాల్‌పేట్‌ పోలీసులు ఆరుగురు నిందితులను గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లో నేపాల్‌ దేశస్థులు చేసిన దోపిడీకి సంబంధించిన వార్తల వీడియోలు యూట్యూబ్‌లో చూసి చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. ఇన్‌స్పెక్టర్‌ నర్సింగ్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పథకం ఎలా వేశారంటే!

నేపాల్‌కు చెందిన రాజ్‌ ఖడ్కా(32), మిలాన్‌(28) స్నేహితులు. వికాష్‌ షా(29) అక్కడే హోటల్‌ నిర్వహిస్తున్నాడు. రోజూ అక్కడికి టీ తాగేందుకు వెళ్తూ ముగ్గురు మిత్రులయ్యారు. హైదరాబాద్‌లో నేపాలీ పని వాళ్లు చేసిన దోపిడీలు, నగదుతో పారిపోయిన ఉదంతాలను యూట్యూబ్‌లో వీక్షించారు. వాటి ప్రేరణతో ఎలాగైనా నగరం చేరి సంపన్నుల ఇంట్లో  దోచుకోవాలని నిర్ణయించుకున్నారు. సికింద్రాబాద్‌ పీజీ రోడ్డులోని బంగారు వ్యాపారి ఇంట్లో పనిచేసి మానేసి స్వదేశానికి వెళ్లిన రాజ్‌కు రాజ్‌ఖడ్కా పరిచయమయ్యాడు. అక్కడ పనిచేస్తున్న శారదను పరిచయం చేసుకుంటే తేలికగా ఉద్యోగం సంపాదించవచ్చని సూచించాడు. దీంతో ఆమె ఫోన్‌ నంబరు సంపాదించి తన భార్య సుష్మిత(28)కు ఇంట్లో పనిచూడమంటూ కోరాడు. రాజ్‌ తమ బంధువేనని చెప్పటంతో శారద తేలికగా నమ్మేసింది.   సుష్మితను తన బంధువు అని చెప్పడంతో  తేలికగా పనిలోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో వాచ్‌మెన్‌ అకస్మాత్తుగా మానేయడంతో యజమాని మరొకరిని చూడమని శారదతో చెప్పాడు. ఈ విషయం సుష్మిత నేపాల్‌లో ఉన్న భర్తకు చేరవేయడంతో అతడు వెంటనే మిలాన్, అతడి భార్య భావన అలియాస్‌ పూజను నగరానికి పంపించాడు. మిలాన్, పూజ దంపతులు వాచ్‌మెన్‌గా ఆ ఇంట్లోకి చేరి అదను కోసం ఎదురు చూడసాగారు. సుష్మితను నల్లకుంటలో నెలకు రూ.5వేలు చెల్లించి ఒక అద్దె ఇంట్లో ఉంచారు. 


రెక్కీ చేశాక.. కొట్టేశారు

వ్యాపారి కుటుంబం ముంబయి వెళ్తున్నట్టు సుష్మిత తెలుసుకుంది. గత నెల 28న నేపాల్‌లో ఉన్న భర్త రాజ్‌ఖడ్కాకు సమాచారం చేరవేసింది. అతడు మిలాన్‌ బంధువు గణేష్‌(38), వికాష్‌షాను తీసుకుని నగరానికి చేరాడు. ఈ నలుగురు 30న సాయంత్రం యజమాని ఇంటికి చేరారు. అక్కడే పని చేస్తున్న చౌదరికి మద్యం తాగించి మత్తులోకి జారుకోగానే ఇంట్లోకి ప్రవేశించి నగదు,  ఆభరణాలు చోరీ చేశారు. రెండు బృందాలుగా విడిపోయి ఈ నెల 1న రైల్లో దిల్లీ వెళ్లారు. ఉదయం నిద్రలేచిన చౌదరి యజమానికి సమాచారం ఇచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో రాంగోపాల్‌పేట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.25-30లక్షల విలువైన సొత్తు మాయమైనట్టు నిర్ధారించారు. ఉత్తరమండలం డీసీపీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు పోలీసుల బృందం దిల్లీ చేరింది. ఈ నెల 5న రాజ్‌ ఖడ్కా, వికాష్‌ షాను అరెస్ట్‌ చేయగా మిగిలిన నలుగురు నేపాల్‌ పారిపోయినట్టు గుర్తించారు. నిందితుల నుంచి రూ.5లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని