అర్హత లేకున్నా.. చికిత్స..!

నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌), పీఎంపీ (ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌)లకు అవకాశముంది

Updated : 21 May 2024 05:36 IST

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్‌ఎంపీ (రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌), పీఎంపీ (ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్‌)లకు అవకాశముంది. కానీ, కొందరి అత్యుత్సాహం కారణంగా ఏకంగా వైద్యులుగా చెలామణి అవుతున్నారు. అర్హత లేకపోయినా పలు రకాల చికిత్సలు అందిస్తున్నారు. కమీషన్ల కోసం అవసరం లేకున్నా రోగులను పెద్దాసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారు. మొత్తంగా నిబంధనలు తోసిరాజని ఇష్టారీతిన వ్యవహరిస్తూ ప్రాణసంకటంగా మారుతున్నారు.

ఏదైనా అనారోగ్య సమస్యకు ఎలాంటి మందులు, ఏ మోతాదులో ఇవ్వాలనేది వైద్యవిద్య పూర్తిచేసిన వారికి అవగాహన ఉంటుంది. కొన్నింటికి సాధారణ మాత్రలిస్తే సరిపోతుంది. ఇంకొన్నింటికి యాంటీబయాటిక్స్‌ అవసరమవుతుంది. అయితే.. త్వరగా నయమవ్వాలన్న ఆతృతలో కొందరు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు అవసరం లేకపోయినా మోతాదుకు మించి ఇస్తున్నారు. యాంటీబయాటిక్స్‌ను విరివిగా వినియోగిస్తున్నారు. దీనివల్ల అనారోగ్యం త్వరగా నయమవుతుంది. ఇది రోగులనూ ఆకట్టుకుంటోంది. ఫలానా వారి వద్దకు వెళ్తే త్వరగా బాగవుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా వారివద్దకు వెళ్తున్నారు. అయితే.. సదరు సమస్య మళ్లీ ఉత్పన్నమైనపుడు అంతకన్నా ఎక్కువ మోతాదులో మందులు వాడాల్సి వస్తుంది. ఇది రోగి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ఇష్టారీతిన మందులు వినియోగించడం రోగనిరోధకతను దెబ్బతీయడమే కాక ఇతర అనారోగ్య సమస్యలకూ కారణమవుతుంది. భవిష్యత్తులో కొత్తకొత్త రోగాలను తీసుకొస్తుంది. ఈ విషయాలు తాజాగా జరిగిన రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుల తనిఖీల్లో వెలుగుచూశాయి.

ఎడాపెడా చికిత్సలు

ఉపాధి కోసం పట్టణానికి వచ్చిన ఓ వ్యక్తి గతంలో అనారోగ్యంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లాడు. అక్కడ చికిత్స పొంది ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికే పరిస్థితి విషమించి మృత్యువాతపడ్డాడు. నిర్లక్ష్యపు చికిత్స కారణంగానే అతడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.

సరైన అర్హత లేకపోయినా పలుచోట్ల ఆర్‌ఎంపీలు ఇస్తున్న చికిత్స కారణంగా కొందరికి ప్రాణాలమీదకు వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించేందుకు కొంతమంది ఆర్‌ఎంపీ, పీఎంపీ శిక్షణ తీసుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. మరికొందరు వైద్యుల వద్ద శిక్షణ పొంది సేవలను కొనసాగిస్తున్నారు. ఇలా వచ్చిన అనుభవమే పెట్టుబడిగా వారంతా వైద్యసేవలకు సన్నద్ధమవుతున్నారు. బెడ్లు, ల్యాబ్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నారు. కొందరైతే అనుబంధంగా మెడికల్‌ దుకాణాలు సైతం నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వైద్యులమంటూ పేరు రాసుకుంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. చాలావరకు ఫ్లూయిడ్స్‌ ఇవ్వడం, నెబులైజర్‌ చికిత్స అందించడాన్ని సాధారణ విషయంగా పరిగణిస్తున్నారు. అవసరం లేకపోయినా వీటిని వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఏర్పడుతుంది. అస్తమా, హృద్రోగ సమస్యలున్నవారికి శ్వాసలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. ఇలాంటివారిని సరిగా పరీక్షించకుండా నెబులైజర్‌ వినియోగిస్తే మొదటికే మోసమొచ్చే అవకాశముంటుంది. చిన్నపిల్లలు, పెద్దలు తేడాలేకుండా అందరికీ చికిత్స అందించడం, ఫ్లూయిడ్స్‌ ఇవ్వడం చేస్తున్నారు.

ఏకారణంతోనైనా ఆసుపత్రికి వెళ్లలేనివారు, ఎవరికీ తెలియకుండా గర్భం తీసేయించుకోవాలనుకునే వారు నేరుగా వీరిని సంప్రదిస్తుండటంతో.. కొందరు గుట్టుచప్పుడు కాకుండా గర్భవిచ్ఛిత్తి మందులను సైతం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు వస్తే ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. విషయం బయటపడితే తమకే ఇబ్బందని భావించి పలువురు ఈ విషయాలను గోప్యంగా ఉంచేస్తున్నారు.

 సిఫార్సులతోనూ సంపాదన

తమవద్దకు వచ్చేవారికి వైద్యం అందించడమే కాదు.. శస్త్రచికిత్స అవసరమైనా, మెరుగైన వైద్యం కోసం వేరే ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా వీరే మధ్యవర్తులుగా ఉంటున్నారు. ఇలా చేసిన సిఫార్సులతో పరోక్షంగా ఆదాయం పొందుతున్నారు. ‘మా ఆసుపత్రికి మీ తరపున ఎవరైనా రోగిని సిఫార్సు చేయండి. ఎంతోకొంత పర్సెంటేజీ ముట్టజెప్తాం..’ అంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆశచూపుతున్నాయి. ఇలాంటి కమీషన్లకు ఆశపడిన కొందరు తమ వృత్తికి చెడ్డపేరు తెచ్చుకునేలా వ్యవహరిస్తున్నారు. అవసరం లేకపోయినా రోగులను భయపెట్టి పెద్దాసుపత్రులకు సిఫార్సు చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. దీనివల్ల అవసరం లేకపోయినా పరీక్షలు చేయిస్తూ రోగులనుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఎటొచ్చీ రోగులు, వారి సంబంధీకులు ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని