అప్రమత్తతకు సాంకేతిక దన్ను

అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.

Updated : 21 May 2024 05:32 IST

దామిని యాప్‌

కొత్తకోట గ్రామీణం, న్యూస్‌టుడే : అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఏ క్షణాన వర్షం కురుస్తుందో.. ఎక్కడ పిడుగు పడుతుందో తెలియని పరిస్థితి. వర్షాలు, పిడుగుపాటుకు గురై మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రైతులను, ప్రజలను అప్రమత్తం చేసి వారికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర వాతావరణ శాఖ ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. వీటిని చరవాణుల్లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే చాలు.. ఎక్కడ పిడుగు పడుతుంది? ఏ సమయంలో వర్షం కురుస్తుందనే విషయాలను భారత వాతావరణ ఖాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా రాబోయే అయిదు రోజుల వరకు వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌లోకి వెళ్లి మూడు యాప్‌లను వేర్వేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి యాప్‌నకు వినియోగదారుడి పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే సరైన సమాచారం అందుతుంది.

రెయిన్‌ అలారం..: స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి రెయిన్‌ అలారం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రైతులు పంటలు పండించి నూర్పిళ్లు చేసి ధాన్యం ఇంటికి చేర్చే వరకు కంటి మీద కునుకు లేకుండా గడుపుతారు. ధాన్యం సిద్ధం చేసుకున్న తర్వాత అకాల వర్షం వల్ల తడిచిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది. రెయిన్‌ అలారం యాప్‌ ద్వారా వినియోగదారుడు అందించిన వివరాల మేరకు సుమారు 20 కి.మీ.దూరంలో ఎక్కడ వర్షం కురిసే సూచనలున్నాయనే సమగ్ర సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. రైతులు ముందే జాగ్రత్త పడొచ్చు.

దామిని..: ఏప్రిల్, మే నెలలో ఈదురు గాలులు వీచి అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొలాల వద్దకు వెళ్లిన రైతులు, ప్రయాణాల్లో ఉన్న వారు వర్షం ప్రారంభం కాగానే చెట్ల కిందకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కిందకు వెళ్లడం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు. దామిని యాప్‌ ద్వారా 5 నుంచి 20 నిమిషాల్లోపు 20 కి.మీ. పరిధిలో ఎక్కడ పిడుగు పడుతుందో క్షణాల్లో సమాచారం అందుతుంది. రైతులు, ప్రజలు అప్రమత్తమై ప్రాణాలను రక్షించుకోవచ్చు.


మేఘదూత్‌ యాప్‌ 

మేఘదూత్‌: పంటలకు రైతులు రసాయన ఎరువులు పిచికారీ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పిచికారీ చేసి ఇంటికి వచ్చే సరికే వర్షం కురిసి మందులు వృథా అవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే వాతావరణ శాఖ మేఘదూత్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తుంది. రాబోయే అయిదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచన, ఆకాశం మేఘావృతం, అవుతుందా? ఈదురు గాలులు ఏ మేరకు ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ దిశగా వీస్తాయనే సమాచారాన్ని అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని