సమాజాన్ని నిలబెట్టేది పుస్తకాలే

‘సమాజంలో విలువలు పడిపోతున్న, కుటుంబ సంబంధాలు పలచనవుతున్న కాలంలో  పుస్తకం అనే పనిముట్టుతో వాటిని నిలబెట్టాలనేదే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ప్రధాన లక్ష్యం’ అని నూతన అధ్యక్షుడు కవి యాకుబ్‌ తెలిపారు.

Updated : 27 May 2024 05:22 IST

‘ఈనాడు’తో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ నూతన అధ్యక్షుడు కవి యాకూబ్‌
ఈనాడు, హైదరాబాద్‌ 

‘సమాజంలో విలువలు పడిపోతున్న, కుటుంబ సంబంధాలు పలచనవుతున్న కాలంలో  పుస్తకం అనే పనిముట్టుతో వాటిని నిలబెట్టాలనేదే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ప్రధాన లక్ష్యం’ అని నూతన అధ్యక్షుడు కవి యాకుబ్‌ తెలిపారు. సిటీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా మూడు దశాబ్దాలు బోధన చేసిన ఆయన 2020లో పదవీ విరమణ చేశారు. 12ఏళ్లుగా ఫేస్‌బుక్‌లో కవి సంగమం పేరుతో అక్షరయజ్ఞం చేస్తున్నారు. తెలుగులో కవిత్వం రాస్తూ..యువ రచయితలను ప్రోత్సహిస్తున్నారు. ప్రచురణకర్త అయిన ఆయన సొసైటీకి నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ‘ఈనాడు’తో మాట్లాడారు. 

36 ఏళ్ల కిందట చిన్నగా మొదలై.. 

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ  36 ఏళ్ల కిందట చిన్నగా మొదలైంది. ప్రచురణ కర్తలు, పుస్తకవిక్రేతలు ఏర్పాటు చేసుకున్న సొసైటీ ఇది. క్రమంగా పెరిగింది. పుస్తకాలను పాఠకుల చెంతకు చేర్చడం,  సమాజాన్ని పుస్తకాల వైపు మళ్లించే లక్ష్యంగా సొసైటీ పనిచేస్తోంది. ఇందుకు పుస్తక ప్రదర్శనలో వేర్వేరు కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

జిల్లాలకు విస్తరించేలా ప్రణాళికలు

నగరానికే పరిమితం కాకుండా జిల్లాలకు పుస్తక ప్రదర్శనను విస్తరించాలనే ఆలోచన ఉంది. గతంలోనూ కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో స్థానిక ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోనే కాదు.. ఖమ్మం జిల్లాలో ఓగ్రామంలోనూ ప్రదర్శన ఏర్పాటుచేసిన చరిత్ర ఉంది. గత అధ్యక్షుడు గౌరీశంకర్‌ విస్తృతంగా కృషి చేశారు. దీన్ని ముందుకు తీసుకెళ్తాం.

దేశంలోనే మంచి పేరుంది

ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని వేర్వేరు నగరాల్లో పుస్తకాల ప్రమోషన్‌ కోసం ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దిల్లీ, కర్ణాటక, కేరళలో బాగా ప్రాచుర్యం పొందాయి. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీకి దేశంలోనే అతిపెద్ద పుస్తక ప్రదర్శనలలో ఒకటిగా పేరుంది. ఇక్కడ ఆంగ్లం, తెలుగు, సాహిత్యం, చరిత్ర, శాస్త్ర విజ్ఞానం ఇలా అన్నిరకాల, అన్ని వర్గాలకు కావాల్సిన పుస్తకాలు ప్రదర్సిస్తారు.

అంతర్జాలం సవాళ్లను అధిగమించేలా

అరచేతిలోకి అంతర్జాలం వచ్చాక సమాచార లభ్యత పెరిగింది. చదవడం కంటే చూసి వదిలేయడం పెరిగింది. దీన్నే లుక్‌ కల్చర్‌ అంటాను. కానీ పుస్తక పఠనం ద్వారా కలిగే ఆనందం వేరు. సమాజాన్ని పఠనం వైపు మళ్లించగలిగితే చాలా మేలు జరుగుతుంది.

అచ్చుకు ఆదరణ ఎలా? 

డిజిటల్‌ యుగంలోనూ అచ్చు పుస్తకాలు కొనడం, చదవడం మరీ తగ్గలేదు, పెరగలేదు. జిల్లా గ్రంథాలయాల సొసైటీతో కలిసి అక్కడ కొత్త పుస్తకాలు దొరికేలా  ప్రజల్లో అవగాహన పెంచేలా అధికారులతో సంయుక్త కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు గ్రంథాలయ ఛైర్మన్‌ను కలవనున్నాం.

తెలుగు భాష వ్యాప్తికి 

యువ రచయితలు ఎంతోమంది తెలుగు రచనలు చేస్తున్నారు. మరింత మందిని రచనల వైపు, పఠనం వైపు మళ్లించాలి. ఇందులో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పాత్ర ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన.

వేసవిలో వచ్చే ఏడాది నుంచి పిల్లల కోసం 

పుస్తక ప్రదర్శన సమయంలోనే కొన్నేళ్లుగా పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం, కవితలు, కథలు రాయడం వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. వేసవిలోనే పిల్లలకు సెలవుల సమయంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ తరఫున బుక్‌ ఎగ్జిబిషన్‌ ఉంటే బాగుంటుందనే ఆలోచన ఉంది. ఈసారి సమయం దాటిపోయింది. వచ్చే ఏడాది నుంచి ఏర్పాటుకు కృషి చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని