Ramoji rao: సామాన్యుడి అక్షరం.. ఈనాడు

తెలుగు భాషకు రామోజీరావు విశేష సేవ చేశారు. వ్యావహారిక భాషను విస్తృతంగా వాడుకలోకి తెచ్చారు.

Published : 09 Jun 2024 01:01 IST

ప్రజా సమస్యలను చేరవేయడం.. అక్షరాలు, అందమైన ఫొటోలు పేర్చేయడం.. కేవలం ఇందులోనే ఓ పత్రిక విజయం ఉండదు! ఏం రాసినా అది సామాన్యులకు సైతం అర్థం కావాలి. ఆ అక్షరాలు వారిలో చైతన్యం నింపాలి. కంటపడిన అన్యాయంపై వారు తమ గొంతుక వినిపించాలి. ఇదీ రామోజీరావు (Ramoji rao) చెప్పే మాట. ‘ఈనాడు’ విజయంలో తెలుగు భాషది కీలక పాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే ‘ఈనాడు’ను ప్రజలకు చేరువ చేసింది. దీనికి కర్త, కర్మ, క్రియ.. రామోజీరావే. 

భాషా పాండిత్యాన్ని వదిలిపెట్టి చిన్న చిన్న పదాలు రాసేందుకు రచయితలు సంకోచించేవారు. గ్రాంథికంలో రాయడమే గొప్పని భావించే వారు. గిడుగు రామమూర్తి వంటి వారి కృషి ఫలితంగా వ్యావహారిక భాషకు ప్రాధాన్యం లభించింది. రచయితల్లో మార్పు వచ్చింది. సామాన్యులు సైతం చదివితేనే తమ భవిష్యత్‌ అని విశ్వసించారు. అలా పత్రికా రచనలో వ్యావహారిక భాష మొదలైంది. ‘ఈనాడు’ దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లింది. తేలిగ్గా చదువుకునేందుకు.. పక్కన ఎవరైనా చదివినా అర్థం చేసుకునే విధంగా భాషా వినియోగం ఉండేది. అందుకు ‘ఈనాడు’ పెద్ద కృషే చేసింది. 1981లో ‘ఈనాడు భాషా స్వరూపాన్ని’ ఆవిష్కరించింది. దాని బాధ్యతను డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణకు రామోజీరావు అప్పగించారు. తర్వాతి కాలంలో ఈ పుస్తకమే జర్నలిస్టులకు కరదీపికగా మారింది.

శ్రీ, శ్రీమతులకు కత్తెర

దిన పత్రికలో వ్యావహారిక భాష వాడటాన్ని ఓ నియమంగా ఈనాడు పాటించింది. పడికట్టు పదాలు, సుదీర్ఘ శీర్షికలు తగ్గేలా శ్రద్ధ మొదలైంది. శ్రీ, శ్రీమతులు వంటి గౌరవ వాచకాలూ తగ్గాయి. ఈనాడు ‘భాషా స్వరూపం’ రావడంతో ఈ మార్పు సాధ్యమైంది. భాష అంటే ప్రామాణికమైనదని వాదించే వారికి.. ఆ వాదన తప్పని ‘ఈనాడు’ నిరూపించింది. పేర్లకు ముందు శ్రీ, శ్రీమతి.. తర్వాత గారు వంటి గౌరవ సూచికలను తీసేసి బహువచన క్రియను వాడడం మొదలు పెట్టింది. చివర్లో అన్నారు, చెప్పారు.. వంటి పదాల వాడకంతో గౌరవం ఇవ్వడం మొదలు పెట్టింది. తర్వాతి కాలంలో అన్ని పత్రికలూ దీన్ని అనుసరించాయి.

మాండలికానికీ పెద్ద పీట

ఎంత వ్యావహారిక భాషను వినియోగించినా అవి అందరికీ చేరువయయ్యేవి కాదు. ఆ క్రమంలో జిల్లా పత్రికల్లో మాండలికాలకు ఈనాడు పెద్ద పీట వేసింది. జిల్లా, ప్రాంతాన్ని బట్టి పదాల వాడుక, స్థానిక మాండలికాల్లోనే రచన సాగేది. దీంతో అనతికాలంలోనే ప్రజలకు ఈనాడు చేరువైంది. అలాగని ఆంగ్ల పదాలు పూర్తిగా విడిచి పెట్టలేదు. అనువాదం వల్ల కృతకంగా మారిన తెలుగు పదం కన్నా.. సులువుగా అర్థమయ్యే ఇంగ్లిష్‌ పదాల వాడుకకు జై కొట్టింది. రోడ్డు, బస్సు వంటి పదాలను వాడుకలోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయ వ్యవహారాలైనా, స్థానిక విషయాలైనా.. అందరికీ చదువుకునేలా చేయడంలోనే ‘ఈనాడు’ విజయ రహస్యం దాగుంది.

పేపర్‌ అంతా ఒక్కరే రాస్తారా?

ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చాయి. పత్రికా ముద్రణ చాలా సులువైంది. ఒకప్పుడు ఈ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. అలాంటి రోజుల్లో ‘ఈనాడు’ పత్రిక చదివే వారికి ఓ అనుమానం ఉండేది. ఒకటే తరహా రచనా శైలి, పదాల వినియోగం చూసిన వారికి ఒక్కరే రాస్తారా ఏంటి? అన్న అనుమానం ఉండేది. దానికి సమాధానమే ఈనాడు జర్నలిజం స్కూల్‌. పనిచేస్తున్న జర్నలిస్టులకు ‘ఈనాడు’ రచనా శైలిని నేర్పించే బదులు.. భావి జర్నలిస్టులకు సొంతంగా శిక్షణ ఇచ్చే ఆలోచన చేశారు రామోజీరావు. అలా పురుడు పోసుకున్నదే ఈనాడు జర్నలిజం స్కూలు. ఇక్కడ శిక్షణ పొందిన వారు ఒకే తరహా రచనా శైలిని అలవర్చుకోవడం వల్లే పత్రికంతా ఒక్కరే రాశారా అన్నట్టు తోచేది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వాడుక భాషలో వస్తున్న మార్పులకు ‘ఈనాడు’ తన విన్యాసాన్ని మార్చుకోవడం వల్లే.. ‘ఈనాడు’కు నాడూ నేడూ పాఠకులు పట్టం కడుతున్నారు. దానికి రామోజీరావు ముందు చూపే నిదర్శనం.

తెలుగు వెలుగు.. 

ఈనాడుతో వ్యావహారిక తెలుగుకు పెద్దపీట వేసిన రామోజీరావు.. తెలుగు భాషాభిమానుల కోసం ‘తెలుగు వెలుగు’ మాసపత్రికను నడిపారు. చతుర, విపుల కూడా పాఠకులను కొన్ని దశాబ్దాల పాటు అలరించాయి. ఇలా తెలుగు  భాషకీ, సమాజానికీ ఇతోధిక సేవ చేసిన రామోజీరావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది తెలుగు భాషాభిమానులకు తీరని లోటు! 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు