Hyderabad: చిలుకూరు ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేశాం: రంగరాజన్‌

హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ తెలిపారు.

Updated : 19 Apr 2024 19:11 IST

మొయినాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణీ నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ తెలిపారు. ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో భారీగా భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు చేరుకోవడంతో చిలుకూరు భక్త జనసంద్రంగా మారింది. ప్రసాదం పంపిణీపై ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్పందించారు. ‘‘సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశాం. మేం ఆశించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తులు రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశాం. రేపు, ఎల్లుండి ప్రసాదం పంపిణీ ఉండదు’’ అని స్పష్టం చేశారు.

ఉదయం నుంచి ట్రాఫిక్‌ రద్దీ...

చిలుకూరు మార్గంలో ఉదయం దాదాపు 10 కి.మీ పైగా వాహనాలు నిలిచిపోయాయి. మాసబ్‌ట్యాంక్‌ నుంచి మెహదీపట్నం, నానల్‌ నగర్‌, లంగర్‌హౌస్‌, సన్‌సిటీ, అప్పా జంక్షన్‌ మీదుగా చిలుకూరు ఆలయం వరకు ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలోని ఔటర్‌ రింగ్‌ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది. దాదాపు లక్ష మంది వరకు వాహనాల్లో వెళ్లినట్లు అంచనా. దీంతో కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు.. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఊహించిన దాని కంటే అధికంగా భక్తులు: మొయినాబాద్‌ సీఐ

వేకువజాము నుంచి ఉదయం 10.30 గంటల వరకు 60వేలకు పైగా భక్తులు ఆలయానికి వచ్చారని మెయినాబాద్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇంకా వస్తూనే ఉన్నారని చెప్పారు.  దేవస్థానం నిర్వాహకులు తెలిపిన మేరకు అంచనా వేసి బందోబస్తు ఏర్పాటు చేశామని.. 5 వేల మంది వరకు వచ్చే అవకాశముందని తమకు చెప్పారన్నారు. ఊహించిన దాని కంటే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని