TS High court: సిద్దిపేటలో సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే

సిద్దిపేటలో సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశంలో పాల్గొన్నారని ఆరోపిస్తూ ఇటీవల వారిపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Published : 19 Apr 2024 14:07 IST

హైదరాబాద్‌: సిద్దిపేట సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారనే కారణంతో 106 మందిని ఇటీవల జిల్లా కలెక్టర్‌ మనుచౌదరి వారిని సస్పెండ్‌ చేశారు. వీరిలో 38 సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ పథకానికి చెందిన వారున్నారు. సెర్ప్‌ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్‌కు లేదని సెర్ప్‌ ఉద్యోగుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు జూన్‌ 18కి వాయిదా వేసింది. 

ఏప్రిల్‌ 7న సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ప్‌ ఉద్యోగులతో మెదక్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, సుడా మాజీ ఛైర్మన్‌ రవీందర్‌ రెడ్డి, మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు. ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను సీసీ టీవీ ఆధారంగా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని