Hyderabad student missing: అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థిని మిస్సింగ్‌

Hyderabad Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని అదృశ్యమైంది. మే 28 నుంచి ఆమె ఆచూకీ తెలియట్లేదు.

Updated : 03 Jun 2024 10:37 IST

హ్యూస్టన్‌: అమెరికా (United States)లో భారతీయ మూలాలున్న విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా (California) రాష్ట్రంలో ఓ 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని (Hyderabad Student Missing) అదృశ్యమైంది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు.

హైదరాబాద్‌కు చెందిన నితీశ కందుల (Nitheesha Kandula) కాలిఫోర్నియా స్టేట్‌ యూనివర్సిటీ, శాన్‌ బెర్నార్డినో (CSUSB)లో చదువుతోంది. మే 28వ తేదీ నుంచి కన్పించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్‌ ఏంజిల్స్‌లో కన్పించినట్లు యూనివర్సిటీ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు.

గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్‌ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియ లేదు. ఇక, ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అరాఫత్‌ కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత నెల రోజులకు క్లీవ్‌లాండ్‌లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. క్లీవ్‌లాండ్‌లోని ఓ డ్రగ్‌ ముఠా అబ్దుల్‌ను కిడ్నాప్‌ చేసి.. అతడి తండ్రికి ఫోన్‌ చేసి డబ్బు పంపాలని డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని