Murder: కర్ణాటకలో హైదరాబాద్‌ బిల్డర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ కర్ణాటకలోని బీదర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతని తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపారు.

Updated : 28 May 2024 12:00 IST

మృతుడు మధు 

ఈనాడు- హైదరాబాద్, జీడిమెట్ల, న్యూస్‌టుడే: హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ కర్ణాటకలోని బీదర్‌లో దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇతని తలపై బండరాయితో కొట్టి ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనపై కర్ణాటకలోని మన్నేకెళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం..జీడిమెట్లలోని కల్పన సొసైటీలో ఉండే కుప్పాల మధు(48) బిల్డర్‌. ట్రావెల్స్‌ వ్యాపారమూ ఉంది. భార్య వెంకటలక్ష్మి, కుమార్తెలు అలేఖ్య, అఖిల ఉన్నారు. మధు వ్యాపారం నిమిత్తం తరచూ బీదర్‌కు వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఈనెల 24న బీదర్‌ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పారు. డ్రైవింగ్‌ కోసం తనతో పాటు చింతల్‌ ప్రాంతానికి చెందిన రేణుక ప్రసాద్‌(32), వరుణ్, లిఖిత్‌ సిద్దార్థరెడ్డిని తీసుకెళ్లారు. రాత్రి 10 గంటలకు భార్య ఫోన్‌ చేయగా హైదరాబాద్‌ వస్తున్నట్లు మధు చెప్పారు. గంట తర్వాత మధుకు భార్య మళ్లీ ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. తెల్లవారినా మధు రాలేదు. బీదర్‌ జిల్లాలోని మన్నేకెళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 25వ తేదీ ఉదయం రోడ్డు పక్కన నిలిపిన కారు వద్ద  మృతదేహం ఉందని,  కారు నంబరు ఆధారంగా మృతుడు మధు అని గుర్తించారు. 25వ తేదీన జీడిమెట్ల పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 

తలపై కొట్టి.. కత్తులతో పొడిచి.. మన్నేకెళ్లి పోలీసులు ఘటనాస్థలంలో పరిశీలించగా మధు పెద్ద బండరాయితో తలపై కొట్టి.. ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపినట్లు గుర్తించారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మధు ఒంటిపై ఉన్న రూ.6 లక్షల విలువైన బంగారం, ఆయన వద్ద ఉన్న పెద్ద మొత్తంలో నగదు కనిపించడం లేదు. నిందితులు వీటిని తీసుకుని పరారైనట్లు భావిస్తున్నారు. మధు హత్య వెనుక అతనితో పాటు బీదర్‌ వెళ్లిన చింతల్‌కు చెందిన ముగ్గురి హస్తం ఉన్నట్లు మన్నేకెళ్లి పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని