CM Revanth: మార్చి 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనుంది.

Updated : 02 Mar 2024 22:51 IST

హైదరాబాద్‌: ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈ నెల 11న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రారంభించనుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ మొదట ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం నిధులను ఏ దశలో, ఎన్ని విడతలుగా విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు అందాల్సిన నిధులు దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల్లో చేసిన తప్పులు జరగకుండా .. అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. ఇంటి నిర్మాణాలను పర్యవేక్షించే బాధ్యతలను కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఇంజినీరింగ్‌ విభాగాలకు అప్పగించాలని సూచించారు. ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని సూచించారు. దశల వారీగా నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు సమాచారం. స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, ఇల్లులేని నిరుపేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని