Journalists protest: పాత్రికేయులపై దాడి.. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు

కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయం, పాత్రికేయులపై దాడి ఘటనలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

Published : 22 Feb 2024 14:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయం, పాత్రికేయులపై దాడి ఘటనలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. అనంతపురం, తిరుపతి, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. అనంతపురంలో స్థానిక సంగమేశ్ థియేటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా జర్నలిస్టులు తరలివచ్చి పాల్గొన్నారు. వైకాపా నేతల దౌర్జన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం తీరును విమర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ నిరసనలకు తెదేపా, సీపీఐ, సీపీఎం, జనసేన నేతలు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. 

గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

పాత్రికేయులపై దాడిని ఖండిస్తూ తిరుపతిలో తెదేపా, ఏఐటీయూసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద తెదేపా, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఏఐటీయూసీ నేతలు ధర్నా చేపట్టారు. అనంతపురం, కర్నూలులో జరిగిన దాడులను తెదేపా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఖండించారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న మీడియా ప్రతినిధులపై వైకాపా నాయకులు దాడికి దిగడం దారుణమన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని.. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

ఏ ప్రభుత్వంలోనూ ఇలా లేదు.. 

మీడియా ప్రతినిధులపై జరిగిన దాడులకు నిరసనగా విశాఖపట్నం జిల్లా సింహాచలంలో పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. నడకమార్గంలో తొలి మెట్టు వద్ద నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలని నినాదాలు చేశారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా ఇలా దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని అంబేడ్కర్‌ సెంటర్‌ వద్ద రాష్ట్ర గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. దాడులకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని