Kamareddy: కామారెడ్డి జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు

మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో కామారెడ్డి జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 25 May 2024 20:13 IST

కామారెడ్డి : మహిళా వైద్యాధికారులను లైంగికంగా వేధించినట్టు తేలడంతో కామారెడ్డి జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్‌వో) లక్ష్మణ్‌సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలతో లక్ష్మణ్‌సింగ్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌నాయక్‌పై కూడా ఓ కేసు నమోదైంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షణ చేయాల్సిన డీఎంహెచ్‌వో అనుచితంగా ప్రవర్తించడంతో దుమారం చెలరేగింది. ఈ నెల 8న జిల్లా కేంద్రంలో జరిగిన ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ఈ విషయం వెలుగు చూసింది. అందులో డీఎంహెచ్‌వో తమతో అసభ్యంగా మాట్లాడారని కొందరు మహిళా వైద్యాధికారులు ఆరోపించారు. తర్వాత రోజు వారు కలెక్టర్‌, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మొదట ఐదుగురు, ఆ తర్వాత ఇద్దరు మహిళా వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంహెచ్‌వోపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని