KTR: ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండానే కవిత అరెస్టా? ఈడీని ప్రశ్నించిన కేటీఆర్‌

ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 15 Mar 2024 22:26 IST

హైదరాబాద్‌: ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘అరెస్టు చేయబోమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చి.. ఇప్పుడు ఎలా అరెస్టు చేశారు? కావాలనే శుక్రవారం వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దంటూ ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు. కవిత అక్రమ అరెస్టును న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్‌ కోరారు. ఈడీకి సహకరిస్తామని కవిత కుటుంబ సభ్యులు, భారాస నేతలు తెలిపారు.

కచ్చితంగా న్యాయం గెలుస్తుంది

కవిత అరెస్టుపై ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగానూ కేటీఆర్‌ స్పందించారు. ‘‘రాజకీయ ప్రత్యర్థులపై అధికార దుర్వినియోగంతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం సర్వసాధారణమైంది. కవిత అరెస్టు విషయం కోర్టు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీని ఈడీ తుంగలో తొక్కి అరెస్టు చేసింది. దీనిపై సర్వోన్నత న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కచ్చితంగా న్యాయం గెలుస్తుంది. చట్టబద్ధంగా ఈ అంశంలో పోరాటం కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.  

బెదిరింపులకు భయపడం: ప్రశాంత్‌రెడ్డి

‘‘చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోంది. రాజకీయంగా కేసీఆర్‌, భారాసను బలి చేయడానికి నరేంద్రమోదీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో మా పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇదో విఫలప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ నేతలు ఇలాంటి పిట్ట బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. దీనిపై ప్రజాక్షేత్రంలో రాజకీయంగానే ఎదుర్కొంటాం. చట్ట పరంగా న్యాయస్థానాల్లో పోరాడుతాం. ఎమ్మెల్సీ కవితకు భారాస పార్టీ, తెలంగాణ సమాజం అండగా ఉంటుంది’’ అని మాజీ మంత్రి, భారాస నేత ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

భారాస ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని