Michaung Cyclone: నిజాంపట్నం వద్ద పదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలికిపాటు

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. మిగ్‌జాం తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Updated : 04 Dec 2023 23:22 IST

నిజాంపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను నిజాంపట్నం సమీపంలో తీరం తాకవచ్చనే సూచనతో తీర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మొత్తం 11 ప్రమాద హెచ్చరికలు ఉండగా.. 10వ నంబర్‌ ఎగరవేయడంతో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భయాందోళన చెందుతున్నారు. హార్బర్ వద్ద సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వేట బోట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరి.. జెట్టి వద్ద నిలిచిపోయాయి. వలలు, బోట్లు జాగ్రత్త చేసుకునే పనిలో జాలర్లు నిమగ్నమయ్యారు. మరోవైపు, తుపాన్‌ తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) కదులుతోంది. మంగళవారం ఉదయం మచిలీపట్నం-బాపట్ల మధ్య నిజాంపట్నానికి సమీపంలో తీరం దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 110 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. తీరం దాటేంత వరకూ కోస్తాంధ్ర తీరప్రాంతానికి సమాంతరంగా సముద్రంలో ‘మిగ్‌జాం’ కదలనుంది. ప్రస్తుతం గంటకు 10 కి.మీ. వేగంతో తుపాను కదులుతోంది.

ప్రస్తుతం చెన్నైకి 90 కి.మీ., నెల్లూరుకు 120 కి.మీ., మచిలీపట్నం, బాపట్ల తీరాలకు 300 కి.మీ. దూరంలో ‘మిగ్‌జాం’ కేంద్రీకృతమైంది. నిజాంపట్నం వద్ద తీరాన్ని దాటిన తర్వాత తీవ్రతుపాను నుంచి తుపానుగా బలహీనపడే అవకాశం ఉంది. తీరాన్ని దాటిన అనంతరం తెనాలి, విజయవాడ మీదుగా కదలనుంది. మంగళవారం అర్ధరాత్రికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయి. తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత చేరువగా రావటంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, గాలులతో తుపాను విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని