Ponnam Prabhakar: పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై తనిఖీలు చేయండి.. రవాణా మంత్రి ఆదేశం

తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేసి చెక్‌ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు.

Published : 11 Jun 2024 20:18 IST

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సుల ఫిట్‌నెస్‌పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను బలోపేతం చేసి చెక్‌ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచాలని  రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సూచించారు. మంగళవారం రవాణాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి స్కూల్‌ బస్సు తనిఖీ చేయాలని, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే రోడ్డు ఎక్కేలా చూడాలని చెప్పారు. వారం రోజులపాటు స్కూళ్లు, కాలేజీల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 

‘‘కారు డోర్‌లకు బ్లాక్‌ ఫిల్మ్‌ గ్లాస్‌ ఉన్న వాటిపై విధిగా తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేస్తే అవినీతికి ఆస్కారం లేకుండా ఆదాయం పెంచుకోవచ్చు. సీజ్‌ చేసిన వాహనాలకు సంబంధించి పాలసీలో ఉన్న విధంగా వ్యవహరించాలి. వాహనాలను భద్రపర్చే ప్రదేశాలపై జిల్లా పోలీస్‌ అధికారులతో కో-ఆర్డినేట్‌ చేసుకోవాలి. హైదరాబాద్‌లో ఆటోరిక్షాలపై ప్రస్తుతం ఉన్న పాలసీతో పాటు సీఎన్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా రూపొందించాలి’’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని