TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది.

Updated : 12 Jan 2024 20:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి, సభ్యులు ఆర్‌.సత్యనారాయణ, కారం రవీందర్‌రెడ్డి, బండి లింగారెడ్డిల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించిన విషయం తెలిసిందే. వారి రాజీనామాలు ఆమోదం పొందిన నేపథ్యంలో ఛైర్మన్, సభ్యుల నియామకానికి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో కమిషన్‌ తీరుపై అభ్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌ ద్వారా తస్కరించినా గుర్తించడంలో విఫలమైందని, పటిష్ఠమైన కంప్యూటర్‌ వ్యవస్థ లేదన్న ఆరోపణలు వచ్చాయి. కమిషన్‌ ఛైర్మన్‌ను తొలగించి, బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత డిసెంబరు 11న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురు సభ్యులు రాజీనామాలు సమర్పించారు. జనవరి 10న వారి రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని