పాతకాలం‌ మొబైళ్లు ఒక్కచోట చేరితే..!

స్మార్ట్ యుగంలో ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్‌లదే హవా. టచ్‌ స్క్రీన్‌, స్మార్ట్‌ కీబోర్డు.. లాక్‌, 2ఎంపీ నుంచి 60 ఎంపీ కెమెరాలు, అన్ని సమకూర్చే యాప్‌లు ఇలా అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. కానీ, ఇవేవీ లేని ఒకప్పటి మొబైళ్లు మీకు గుర్తున్నాయా? నోకియా 1100, 6620, 5300, 3310, సోనీ ఎరిక్సన్‌ డబ్యూ910, శాంసంగ్‌

Published : 16 Nov 2020 09:37 IST

వెయ్యికిపైగా మొబైళ్లు సేకరించిన టర్కీవాసి

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్ యుగంలో ఇప్పుడంతా స్మార్ట్‌ఫోన్‌లదే హవా. టచ్‌ స్క్రీన్‌, స్మార్ట్‌ కీబోర్డు.. లాక్‌, 2ఎంపీ నుంచి 60 ఎంపీ కెమెరాలు, అన్ని సమకూర్చే యాప్‌లు ఇలా అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది. కానీ, ఇవేవీ లేని ఒకప్పటి మొబైళ్లు మీకు గుర్తున్నాయా? నోకియా 1100, 6620, 5300, 3310, సోనీ ఎరిక్సన్‌ డబ్యూ910, శాంసంగ్‌ ఎస్‌729ఐ, మోటోరోలా రేజర్‌ వీ3 ఇలా అనేక బ్రాండ్ల మోడళ్లు ఒకప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవి. అప్పటి మొబైళ్లలో నంబర్ల కీబోర్డు, చిన్నసైజు తెర ఉండేది, కాల్స్‌, మెసెజ్‌లు చేయడానికి, పాటలు వినడానికే ఉపయోగపడేవి. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ.. ఈ మొబైల్‌ ఫోన్లు రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. దీంతో ఆ ఫోన్లు ఔట్‌డేటెడ్‌ అయ్యాయి. ఇప్పటి పిల్లలకు ఆ ఫోన్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. మరి ఆ పాతకాలం మొబైళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో, ఏమైపోయాయో ఎవరికీ తెలియదు.. పట్టించుకోరు. కానీ, ఓ వ్యక్తి స్మార్ట్‌ఫోన్‌కు ముందు వినియోగంలో ఉన్న వందలాది మొబైళ్లను సేకరించి దగ్గర పెట్టుకున్నాడు. ఇటీవల ఆ ఫోన్లను ప్రదర్శించి వార్తల్లో నిలిచాడు.

టర్కీకి చెందిన సహబెట్టిన్‌ ఓజ్‌సెలిక్‌ సెల్‌ఫోన్‌ మెకానిక్‌. 20ఏళ్ల కిందటే సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపు పెట్టుకొని, అన్ని రకాల మొబైళ్ల మోడల్స్‌ను సేకరించడం మొదలుపెట్టాడు. ‘‘సెల్‌ఫోన్లపై ఉన్న ఆసక్తితో వాటిని సేకరించడం ప్రారంభించాను. ఏదో ఒక రోజు ఇవన్నీ ఔట్‌డేటెడ్‌ అయిపోతాయని, తయారీ ఆగిపోతుందని తెలుసు. అప్పుడు ఇవి అరుదైనవి, ఆమూల్యమైనవిగా మిగులుతాయని భావించే సేకరించా’’అని చెప్పుకొచ్చాడు. సహబెట్టిన్‌ వద్ద నోకియా, శాంసంగ్‌, మోటొరోలా ఇలా అన్ని రకాల బ్రాండ్లకు చెందిన అనేక రకాల మొబైళ్లు వెయ్యికిపైగా ఉన్నాయి. ఇది వరకు 2వేల వరకు ఉండేవట. రెండేళ్ల కిందట అతడి ఇంట్లో దొంగలు పడి దాదాపు 700 ఫోన్లు ఎత్తుకుపోయారు. దీంతో ప్రస్తుతం 1300 మొబైళ్ల దాకా ఉన్నాయి. అన్ని మొబైళ్లు ఇప్పటికీ పనిచేస్తుండటం విశేషం. అరుదైన ఫోన్లు కూడా అతడి వద్ద ఉండటంతో చాలా మంది తమకు విక్రయించమని అడుగుతున్నారట. ఎంత డబ్బయినా ఇస్తామని చెబుతున్నారట. కానీ, వాటిని విక్రయించేందుకు సహబెట్టిన్‌ ఇష్టపడట్లేదు. ఎంత డబ్బు ఇచ్చినా వాటిని అమ్మేది లేదని తేల్చి చెబుతున్నాడు. ఈ మొబైళ్లను సేకరించడం పట్ల గర్వంగా ఉంటుందని, వీటిని ఎప్పటికీ తన వద్దే పెట్టుకొని కండిషన్‌లో ఉండేలా చూసుకుంటానని అంటున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని