NTR: సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు.

Updated : 28 Aug 2023 14:59 IST

దిల్లీ: భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని.. రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు. 

ఎన్టీఆర్ కుమార్తె, భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అంటే తెలియని వారు ఉండరని చెప్పారు. మహిళకు ఆస్తిలో హక్కు కల్పించింది ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తిరుపతిలో మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్ ఒకతరం హీరో మాత్రమే కాదని.. అన్ని తరాలకు ఆదర్శ హీరో అని పురందేశ్వరి కొనియాడారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. 

ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ తనయులు నందమూరి బాలకృష్ణ, మోహనకృష్ణ, రామకృష్ణ, కుమార్తెలు పురందేశ్వరి, భువనేశ్వరితో పాటు ఇతర కుటుంబసభ్యులు హాజరయ్యారు. వీరితో పాటు తెదేపా ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, గల్లా జయదేవ్‌, కేశినేని నాని, వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు, భాజపా ఎంపీ సీఎం రమేశ్‌, మాజీ ఎంపీలు సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌కు సినీ, రాజకీయ రంగాల్లో సన్నిహితంగా మెలిగిన మరికొంతమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

తొలిసారి వ్యక్తి చిత్రంతో నాణెం ముద్రణ: మింట్‌ చీఫ్‌ మేనేజర్‌ వీఎన్‌ఆర్‌ నాయుడు

‘‘ఎన్టీఆర్‌ స్మారక నాణెం హైదరాబాద్‌లోనే తయారైంది. హైదరాబాద్‌ మింట్‌లో తొలిసారి వ్యక్తి చిత్రంతో నాణెం ముద్రించాం. ఇది మార్కెట్‌లో చలామణి కోసం కాదు. తొలి విడతలో 12 వేల స్మారక నాణేలు ముద్రించాం. రూ.3,500 నుంచి రూ.4,850 వరకు నాణేల ధర ఉంటుంది. ఆన్‌లైన్‌, హైదారాబాద్‌లో 3 చోట్ల నాణేలను విక్రయిస్తున్నాం. డిమాండ్‌కి తగినంతగా నాణేల సరఫరా లేదు’’ అని మేనేజర్‌ తెలిపారు.

‘‘ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన భారత రాష్ట్రపతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎన్టీఆర్ ప్రపంచ సంపద. తెలుగువారందరికీ ఈ కార్యక్రమం ఎంతో గర్వకారణం. భిన్నాభిప్రాయాలు, హద్దులు, రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఎన్టీఆర్‌ తెలుగువారందరినీ ఏకం చేశారు’’ - ట్వీట్‌ చేసిన తెదేపా అధినేత చంద్రబాబు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని