TMC MLAs: ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం వివాదాస్పదం.. రూ.500 చొప్పున జరిమానా!

Eenadu icon
By General News Team Updated : 19 Dec 2024 16:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఎన్నికైన ఇద్దరు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార అంశంపై వివాదం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటున్న రాజ్‌భవన్‌.. వారి ప్రమాణస్వీకార చట్టబద్ధత, ప్రక్రియను ప్రశ్నిస్తూ  సదరు ఎమ్మెల్యేలకు ఈ-మెయిల్‌ పంపించింది. ఈ సందర్భంగా వారిద్దరికీ రూ.500 జరిమానా చెల్లించాలని అందులో పేర్కొంది. ప్రమాణ స్వీకారంతోపాటు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రాజ్‌భవన్‌ ఈ మెయిల్‌ పంపినట్లు టీఎంసీ ఎమ్మెల్యేలు.. రేయాత్‌ హుస్సేన్‌ సర్కార్, సయంతికా బెనర్జీ పేర్కొన్నారు. 10 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో గవర్నర్‌ కార్యాలయం తాజా చర్యలకు ఉపక్రమించింది.

ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన రేయాత్‌ హుసేన్‌ సర్కార్, సయంతికా బెనర్జీలతో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ జులై 5న ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమం అనంతరం శాసనసభ నిరవధికంగా వాయిదాపడింది. వీరి ప్రమాణం రాజ్‌భవన్‌లోనే నిర్వహించాలన్న తన వైఖరిని మార్చుకున్న గవర్నర్‌ సి.వి.ఆనంద్‌ బోస్‌.. ఆ కార్యక్రమాన్ని అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ బెనర్జీ ద్వారా చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆదేశాలిచ్చారు. అయితే, ఒకరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ భేటీ కాగా సభా నిర్వహణకు స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ అధ్యక్షత వహించారు. సభాపతి ఉన్న సమయంలో కొత్త సభ్యులతో తాను ప్రమాణం చేయించడం సరికాదంటూ శాసనసభ నిబంధన 5ను ఉటంకిస్తూ డిప్యూటీ స్పీకర్‌ ఆశీష్‌ బెనర్జీ అందుకు నిరాకరించారు. ఆయన అభ్యర్థనతో స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు.

Tags :
Published : 23 Jul 2024 00:08 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు