Andhra News: రుయా ఘటనపై తీవ్ర విమర్శలు.. ఆస్పత్రి వద్ద తెదేపా, భాజపా ఆందోళనలు

తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి ఆర్డీవో, ఎస్పీ, డీఎంహెచ్‌వో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన

Updated : 26 Apr 2022 13:54 IST

ఆస్పత్రిలో సమస్యలున్నాయన్న అధికారులు

తిరుపతి: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన విషాద ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్పత్రికి ఆర్డీవో, ఎస్పీ, డీఎంహెచ్‌వో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అధికారులు ఆస్పత్రిలో కొన్ని సమస్యలు ఉన్నాయని అంగీకరించారు. మృతదేహాలను దూర ప్రాంతాలకు తరలించడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. వీటిపై కలెక్టర్‌తో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక రూపొందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని తండ్రి ఇంటి వరకూ బైక్‌పై తీసుకుపోలేదని.. కొంత దూరం వెళ్లాక అంబులెన్స్‌లో తరలించినట్లు చెప్పారు. బయటి నుంచి వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుకున్న వారిలో నలుగురిని గుర్తించినట్లు తెలిపారు. ఇంకా ఎక్కువ మంది ఉన్నా వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంతర్గత విబేధాలు..

అధికారుల మీడియా సమావేశం సాక్షిగా ఆస్పత్రి అధికారుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న డీఎంహెచ్‌వో వ్యాఖ్యలపై ఆస్పత్రి అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు చర్చించకుండా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని డీఎంహెచ్‌వోను నిలదీసింది. ఇంతలో కలగజేసుకున్న భాజపా నేత భాను ప్రకాశ్‌రెడ్డి.. అంతర్గత వ్యవహారాలు బయట తేల్చుకోండని వారించారు. ఆస్పత్రిలో అంతర్గత విబేధాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు.

తెదేపా, భాజపా ఆందోళనలు..

మరోవైపు అధికారులు సిబ్బంది తీరుపై తెదేపా, భాజపా వేర్వేరుగా ఆందోళనలు చేపట్టాయి. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహాప్రస్థానం వాహనాలను సరిగా నిర్వహించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుయాలో అన్నమయ్య జిల్లాకు చెందిన బాలుడు మృతిచెందగా.. అంబులెన్స్‌ డ్రైవర్ల నిర్వాకం వల్ల మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని