Tirumala: తిరుమలలో రద్దీ.. 3 కి.మీ మేర బారులు తీరిన భక్తులు..

శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.

Updated : 24 May 2024 17:54 IST

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో శుక్రవారం రద్దీ  నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది.

వారాంతంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

వేసవి సెలవులు, పోలింగ్‌ ప్రక్రియ పూర్తవడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30-40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు గానూ జూన్‌ 30వ తేదీ వరకు వారాంతాల్లో (శుక్ర, శని, ఆది) వీఐపీ బ్రేక్‌ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని