Vande Bharat express: సికింద్రాబాద్‌ టు విశాఖ.. మరో ‘వందే భారత్‌’.. పట్టాలపైకి ఎప్పుడంటే?

సికింద్రాబాద్‌ - విశాఖపట్నం మధ్య మరో వందే భారత్‌రైలు అందుబాటులోకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది.

Updated : 10 Mar 2024 21:55 IST

Vande Bharat express | హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలను కలుపుతూ మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat express) పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారైంది.  సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్‌ రైలు (నం.20707/20708) మార్చి 12న ప్రారంభం కానుంది. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ రైలు గురువారం మినహా మిగతా రోజుల్లో సర్వీసులందించనుంది. రెగ్యులర్‌ సర్వీసులు మార్చి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. బుకింగ్‌లు మార్చి 12 నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. (Secunderabad- Visakhapatnam Vande bharat express)

సికింద్రాబాద్‌- విశాఖపట్నం వందే భారత్‌ రైలు (20707) ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. మళ్లీ అదే రోజు  విశాఖపట్నంలో మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరిన (20708) రాత్రి 11.20గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. వరంగల్‌, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగనుంది. 530 మంది ప్రయాణికుల సామర్థ్యంతో నడిచే ఈ రైలులో ఏడు ఛైర్‌కార్‌ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ కోచ్‌ ఉన్నాయి. 

ఏ స్టేషన్‌కు ఎన్నిగంటలకు?

విశాఖపట్నం-సికింద్రాబాద్‌-విశాఖపట్నం తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20833/20834)ను 2023 జనవరి 15న సంక్రాంతి రోజు పట్టాలెక్కిన విషయం తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ ఉండటం, వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. రిజర్వేషన్‌ దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. రానుపోను ఒక్కటే రైలు ఉండటంతో సాంకేతికంగానూ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో మరో రైలు ఏర్పాటుతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. తొలి రైలు 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్త రైలు ఎనిమిది బోగీలతో పట్టాలెక్కనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని