ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప

బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated : 18 May 2024 20:39 IST

సికింద్రాబాద్: బుల్లితెర నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప స్పందించారు. ఐదు సంవత్సరాలుగా పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్రినయిని సీరియల్ ప్రాజెక్టు వచ్చినప్పటి నుంచి వారి మధ్య వివాహేతర సంబంధం కొనసాగిందని చెప్పారు. చందు తన వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని.. ప్రస్తుతం తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని వివరించారు. గత ఐదు సంవత్సరాలుగా పవిత్ర మాయలో పడి తమను పట్టించుకోవడం మానేశాడని, ఇంటికి కూడా రాలేదని ఆమె వెల్లడించారు. అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూసేవాడని తెలిపారు.

‘త్రినయని’ సీరియల్‌ నటుడు చందు ఆత్మహత్య

వివాహం జరిగిన తర్వాత వివాహేతర సంబంధాల మూలంగా జీవితాలు నాశనం అవుతున్నాయని, ప్రస్తుతం తమ పరిస్థితి కూడా అలాగే ఉందని శిల్ప ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్ర ఆకస్మిక మృతితో చందు ఒత్తిడికి గురయ్యాడని, ఇటీవల కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని చెప్పారు. పవిత్ర నీ దగ్గరికి వస్తున్నా అంటూ ఇన్‌స్టాలో మెసేజ్‌లు కూడా పెట్టినట్లు తెలిపారు. శుక్రవారం ఆయన ఫోన్ ఎత్తకపోయేసరికి అనుమానం కలిగి తమకు తెలిసిన వాళ్లను అక్కడికి పంపినట్లు చెప్పారు. అప్పటికే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు తెలిపారు. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని శిల్ప వేడుకున్నారు.

పెళ్లి చేసుకున్న భార్యను, కన్న బిడ్డల్ని కూడా చందు పట్టించుకోలేదని ఆయన తండ్రి వెంకటేశ్‌ తెలిపారు. తల్లిదండ్రులను కూడా చందు లెక్క చేయలేదని చెప్పిన ఆయన.. 16వ తేదీన వచ్చి కాసేపు మాట్లాడి ‘నేను రెండు రోజులే బతుకుతా.. ఆ తర్వాత మా మేడమ్‌ దగ్గరకు వెళ్లిపోతా. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో’ అని చందు కోరాడని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని