Suneetha Narreddy: అన్నగా కాకపోయినా.. సీఎంగానైనా జవాబు చెప్పాలి: సునీత

ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చు.. పదేపదే చేయలేరని గ్రహించాలని  మాజీ మంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు.

Updated : 02 Apr 2024 13:07 IST

అమరావతి: ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని.. పదేపదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి అన్నారు. వైఎస్‌ షర్మిల, తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్‌, వైకాపా నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు. తప్పును గ్రహించానని.. దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని.. వాస్తవాలేంటో వారికి తెలుసన్నారు. హైదరాబాద్‌, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా.. సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జగన్‌కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్‌ మాటలతో ప్రతిసారీ అందర్నీ మోసం చేయలేరన్నారు. 

అవినాష్‌ను ఎందుకు కాపాడుతున్నారు?

‘‘వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా! అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో.. ఎవరు చేయించారో మీకూ తెలిసినట్లే కదా! అది ఎందుకు బయటపెట్టడం లేదు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది. అవినాష్‌రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే.. ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంతభయం దేనికి?నేరుగా మాట్లాడాలంటే చెప్పండి. నాకు అభ్యంతరం లేదు.. మీ సాక్షి ఛానల్‌కి వస్తా.. డిబేట్‌ చేద్దాం. నిజానిజాలు బయటకు వస్తాయి. ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారు’’ అని సునీత వ్యాఖ్యానించారు.

షర్మిల పవర్‌ఫుల్‌ అవుతుందని జగన్‌ భయపడ్డారు

కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైఎస్‌ షర్మిలకు సునీత అభినందనలు తెలిపారు. ఆమెను ఎంపీగా పోటీ చేయించాలని తన తండ్రి శాయశక్తులా ప్రయత్నించారని.. ఈ క్రమంలోనే హత్యకు గురయ్యారని చెప్పారు. 2012లో జగన్‌ జైలుకు వెళితే 15 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గెలిచేలా షర్మిల కృషి చేశారన్నారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసినట్లు గుర్తుచేశారు. అంత కష్టపడి వైకాపాను నిలబెట్టిన తర్వాత తను ఇంకా పవర్‌ఫుల్ అవుతుందని భయపడి జగన్‌ ఆమెను పక్కన పెట్టారన్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న షర్మిలకు మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని