Tamilisai soundararajan: మహిళపై పోలీసుల దాడి ఘటన.. గవర్నర్‌ ఆగ్రహం

స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి దిగారు. రాత్రి 11 గంటల తర్వాత ఠాణాకు తీసుకురావడంతో పాటు, లాఠీలతో దారుణంగా కొట్టారు.

Updated : 18 Aug 2023 21:54 IST

హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం నాడు అర్ధరాత్రి వేళ ఓ మహిళపై ఇద్దరు పోలీసులు దాష్టీకానికి దిగారు. రాత్రి 11 గంటల తర్వాత ఠాణాకు తీసుకురావడంతో పాటు, లాఠీలతో దారుణంగా కొట్టారు. ఎల్బీనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్రంగా స్పందించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌), డీజీపీ, రాచకొండ సీపీలను ఆదేశించారు. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్నారు. బాధిత మహిళకు అండగా ఉండాలని రెడ్‌క్రాస్‌ సొసైటీకి గవర్నర్ సూచించారు.

ఆగస్టు 15 రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తుండగా.. ఎల్బీనగర్‌ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ  ఠాణాకు తీసుకొచ్చారు. సెక్షన్‌ 290 కింద కేసు నమోదు చేశారు. వారిలో మీర్‌పేటకు చెందిన మహిళ.. తమను ఎందుకు తీసుకొచ్చారని గట్టిగా ప్రశ్నించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్‌, సుమలత ఆమెపై లాఠీతో విరుచుకుపడ్డారు. ఆమె ఎడమ మోకాలి పైభాగం పూర్తిగా కమిలింది. అరికాళ్లపై కొట్టడంతో నడవలేని పరిస్థితి. రాత్రంతా స్టేషన్‌లో ఉంచి, ఉదయం ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంలో రాత్రి విధుల్లో ఉన్న ఎస్సై పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సూచనతోనే దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదైంది. కమిషనర్‌ చౌహాన్‌ విచారణకు ఆదేశించారు. దాడికి పాల్పడ్డ హెడ్‌ కానిస్టేబుల్‌ శివశంకర్‌, మహిళా కానిస్టేబుల్‌ సుమలతను సస్పెండ్‌ చేస్తున్నట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని