Telangana State song: తెలంగాణ రాష్ట్ర గీతం భేష్‌.. కాంగ్రెస్, మిత్రపక్ష నేతల హర్షం

తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Updated : 30 May 2024 19:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గీతానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, జూన్‌ 2న ‘జయ జయహే తెలంగాణ’  గేయం జాతికి అంకితం చేయనున్నట్టు  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసిన రాష్ట్ర అధికార గీతంపై కాంగ్రెస్, మిత్రపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు.  సచివాలయంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెజస నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశయ్యారు. ఈ సందర్భంగా.. సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన బృందం ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ఆలపించారు. గీతంలో చేసిన మార్పులను కవి అందెశ్రీ వివరించారు. 13 చరణాలతో ఉన్న పూర్తి గీతం నిడివి 13.30 నిమిషాలు ఉంటుందని తెలిపారు. చరణాలు తగ్గించి రెండున్నర నిమిషాలతో రూపొందించిన గీతాన్ని కూడా వినిపించారు. రెండూ బాగున్నాయని నేతలు అన్నారు. మఖ్దూం మొహినుద్దీన్, కొమురం భీం, షేక్ బందగీ వంటి తెలంగాణ యోధుల పేర్లు కూడా ఆ గీతంలో చేర్చాలని నాయకులు సూచించగా.. పరిశీలించాలని కవి అందెశ్రీకి సీఎం సూచించారు. 

రాష్ట్ర అధికార చిహ్నాన్ని ఇంకా ఖరారు చేయలేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చిహ్నంపై ఎలాంటి భేషజాలు, పంతాలు లేవని చెప్పారు. అందరి సూచనలు తీసుకుంటామని.. అవసరమైతే కేబినెట్‌, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. సమావేశంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ జన సమితి నేత కోదండరాం, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని