Telangana 10th Exams: తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి పదోతరగతి పరీక్షలు

తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

Updated : 28 Dec 2022 21:41 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్‌ 3 నుంచి 11వ తేదీ వరకు పది పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సైన్స్‌ పరీక్ష మాత్రం ఉదయం 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుంది. ఏప్రిల్‌ 3న మొదటి భాష, 4న రెండో భాష, 6న ఆంగ్లం పరీక్ష నిర్వహిస్తారు. 8న గణితం, 10న సైన్స్‌, 11న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. 12న ఎస్‌ఎస్సీ మొదటి పేపర్‌, 13న ఓఎస్‌ఎస్సీ రెండో పేపర్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

పది పరీక్షల సన్నద్ధతపై అధికారులతో విద్యాశాఖ మంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నుంచి ఆరుపేపర్లతో, వందశాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నరల్‌ ఛాయిస్‌ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్‌ లేదన్నారు. నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలని ఆదేశించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ పైనల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రైవేటు  పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణతా శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఆరు పేపర్లతో 9,10 పరీక్షలు...

తొమ్మిది, పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక నుంచి 9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని వెల్లడించింది. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని