AP News: నందిగామలో టాయిలెట్‌ల పక్కన మహనీయుల విగ్రహాలు

ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు తొలగించారు.

Updated : 17 Aug 2023 11:12 IST

నందిగామ: ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ గాంధీ సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి భారీ పోలీసు బందోబస్తు మధ్య జాతీయ, రాష్ట్ర నేతల విగ్రహాలను అధికారులు తొలగించారు. సెంటర్‌లో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌, అబ్దుల్‌కలాం, రాజీవ్‌గాంధీ, ఎన్టీఆర్‌, గుర్రం జాషువా, దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు తదితర నేతల విగ్రహాలు ఉన్నాయి. తొలగించిన విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో టాయిలెట్‌ల పక్కన పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహనీయులకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విగ్రహాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నేతల గృహ నిర్బంధం..

అర్ధరాత్రి మహానీయుల విగ్రహాల తొలగింపుపై మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో దశాబ్దాల నాటి విగ్రహాలను ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా వైకాపా నాయకుల ఆదేశం మేరకు.. మున్సిపల్‌ అధికారులు తొలగించారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ఉంచి మిగిలిన విగ్రహాలను తొలగించి వారిని అవమానించారన్నారు. తెలుగు దేశం అధికారంలోకి రాగానే విగ్రహాలన్నీ పున:ప్రతిష్ఠ చేస్తామన్నారు. ఈ క్రమంలో నందిగామకు వెళ్లకుండా గొల్లపూడిలోనే ఉమాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అలాగే నందిగామ తెదేపా ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆమెను ఇంటి నుంచి బయటకు రాకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని