TG Cabinet: సన్నవడ్లకు క్వింటాల్‌కు ₹500బోనస్‌.. TG కేబినెట్‌ కీలక నిర్ణయాలివే..

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Published : 21 May 2024 00:03 IST

హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని, ఈ వేడుకలకు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లపై పూర్తి బాధ్యత కలెక్టర్లకే అప్పగించారు. రైతులకు నష్టం జరగకుండా చివరి గింజ వరకూ కొనాలని సీఎం ఆదేశించారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు మీడియాకు వెల్లడించారు.

  • అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే సేకరించాలని నిర్ణయం
  • ఎంఎస్‌పీ కంటే ఒక్క రూపాయి కూడా తక్కువ చెల్లించకూడదని నిర్ణయం
  • రాష్ట్రానికి అవసరమైన సన్న బియ్యం అంతా రాష్ట్రంలోనే సేకరిస్తాం
  • సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌
  • నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు
  • ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణకు రూ.600 కోట్లు కేటాయింపు
  • అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌కమిటీ
  • కాళేశ్వరం ప్రాజెక్టులో మరమ్మతులు చేయాలని నిర్ణయం
  • మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఏం చెప్తే అది చేయాలని నిర్ణయం

మంత్రివర్గంలో మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా చర్చించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కాళేశ్వరం విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలకనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు. ‘‘మేడిగడ్డకు మరమ్మతులు చేస్తే.. సరి అవుతుందన్న గ్యారెంటీ లేదని, నీరు నిల్వ చేసే పరిస్థితి కూడా లేదని ఎన్‌డీఎస్‌ఏ కమిటీ చెప్పింది. అందుకే, తాత్కాలికంగా ఏమైనా ఏర్పాటు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని భావిస్తున్నాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని