Revanth Reddy: తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా అధికారిక చిహ్నం!

తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు.

Published : 27 May 2024 16:12 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రముఖ చిత్రకారుడు రుద్ర రాజేశం ఈ చిహ్నాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేతృత్వంలోని బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించారు. సుమారు 12 నమూనాలు రూపొందించగా.. వాటిలో ఒకటి సీఎం రేవంత్‌రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందే చిహ్నాన్నే.. జూన్‌ 2న ఆవిష్కరించనున్నారు. 

ఇక రాష్ట్ర గీతంగా ఖరారు చేసిన ‘జయ జయహే తెలంగాణ’కు తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం సూచనలతో భావం, భావోద్వేగం మారకుండా రెండు నిమిషాల గీతంలో కవి అందెశ్రీ మార్పులు చేశారు. సీఎం రేవంత్‌, అందెశ్రీ సూచనలకు అనుగుణంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరకల్పన చేశారు. ఈ గీతాన్ని కూడా జూన్‌ 2న ఆవిష్కరించనున్నారు. మరోవైపు తెలంగాణ తల్లి రూపం ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని