Offbeat: 94ఏళ్లుగా ఆ పత్రికలో వార్తలు చేతిరాతలే!

వార్తాపత్రికకు ఒక్కోశైలి ఉంటుంది. వార్తల్లో అక్షరాల సరళి, సైజు, ఫాంట్ భిన్నంగా ఉంటాయి. వాటిని కంప్యూటర్‌లో డిజైన్‌ చేస్తుంటారు. ఒకప్పుడు టైప్‌రైటింగ్‌ మిషన్‌లో వార్తను టైప్‌ చేసి పత్రికలను ప్రింట్‌ చేసేవారు. కానీ, చెన్నై కేంద్రంగా నడిచే ‘ది ముసల్మాన్‌’ అనే ఉర్దూ వార్తాపత్రిక మాత్రం మరింత

Updated : 12 Nov 2021 16:06 IST

ఒక్కో వార్తా పత్రికకు ఒక్కో శైలి ఉంటుంది. వార్తల్లో అక్షరాల సరళి, సైజు, ఫాంట్ భిన్నంగా ఉంటాయి. వాటిని కంప్యూటర్‌లో డిజైన్‌ చేస్తుంటారు. ఒకప్పుడు టైప్‌రైటింగ్‌ మిషన్‌లో వార్తను టైప్‌ చేసి పత్రికలను ప్రింట్‌ చేసేవారు. కానీ, చెన్నై కేంద్రంగా నడిచే ‘ది ముసల్మాన్‌’ అనే ఉర్దూ వార్తాపత్రిక మాత్రం మరింత విభిన్నం. ఎందుకంటే ఆ పత్రికలో ప్రతి వార్తను ఆ సంస్థ ఉద్యోగులు స్వహస్తాలతో రాస్తారు. అలా చేతితో రాసిన వార్తలను.. ప్రింట్‌ చేసి పాఠకులకు చేరవేస్తారు. 94 ఏళ్లుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ వార్తాపత్రిక.. ప్రపంచంలోనే ఏకైక ‘చేతిరాత’ వార్తాపత్రికగా పేరుపొందింది.

ది ముసల్మాన్‌ ఉర్దూ వార్తాపత్రికకు ప్రస్తుతం సయ్యద్‌ ఆరిఫుల్లా ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య పదిలోపే. 800 చదరపు అడుగుల గదిలోనే ఈ పత్రికా సంస్థను నడిపిస్తున్నారు. నాలుగు పేజీలు ఉండే ఈ వార్తాపత్రికలో వార్తలను చేతితో రాయడానికి కాలిగ్రాఫీ నైపుణ్యం ఉన్నవారిని ఉద్యోగులుగా నియమించుకున్నారు. వారిని కాతిబ్స్‌ అని పిలుస్తారు. ఒక్కో పేజీలో వార్తలు రాయడానికి వారికి కనీసం మూడు గంటలు పడుతుందట. వార్తల్లో ఒక్క తప్పు దొర్లినా.. మళ్లీ కొత్త పేజీలో మొదటి నుంచి వార్తలు రాయాల్సిందే. తప్పులు లేకుండా వార్తలు రాసిన తర్వాత వాటిని నెగటివ్స్‌గా మార్చి ప్రతులు ప్రచురిస్తారు. తొలిపేజీలో జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. 2,3 పేజీల్లో స్థానిక వార్తలు.. నాలుగో పేజీలో క్రీడావార్తలు ఉంటాయి.

ప్రకటనలకు మాత్రమే కంప్యూటర్‌

ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉండగా ఇంకా చేతిరాతతోనే వార్తలు ఎందుకు రాస్తున్నారని అడిగితే.. తన తాత ప్రారంభించిన ఈ చేతిరాత వార్తపత్రికను అలాగే కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆరిఫుల్లా తెలిపారు. దీనికి డిజిటల్‌ రూపం ఇచ్చే ఆలోచన లేదని, తాత ప్రారంభించిన పత్రిక ప్రచురణ విధానంలో మార్పులు చేయబోమని ఆరిఫుల్లా స్పష్టం చేశారు. అయితే, పత్రికకు ఆదాయం ప్రకటనలే కాబట్టి.. వివిధ సంస్థలు ఇచ్చే ప్రకటనలను కంప్యూటర్‌లో డిజైన్‌ చేసి పత్రిక పేజీల్లో అతికిస్తారు. అలాగే, ‘ది ముసల్మాన్‌’ లోగోను కూడా ప్రింట్‌ తీసి.. పత్రికకు అతికిస్తారు. ప్రభుత్వం, ఇతర ప్రైవేటు సంస్థలు ఇచ్చే ప్రకటనలతో వచ్చే ఆదాయంతో పత్రికను నడిపిస్తున్నట్లు ఎడిటర్‌ ఆరిఫుల్లా చెప్పారు.

94ఏళ్ల చరిత్ర..

1927లో చెన్నైలోని ట్రిప్లికేన్‌ హైరోడ్‌లో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆరిఫుల్లా తాత సయ్యద్‌ అజ్మతుల్లా ఈ ‘ది ముసల్మాన్‌’ ఉర్దూ వార్తాపత్రికను ప్రారంభించారు. స్వహస్తాలతో వార్తలు రాసి.. వాటిని అచ్చువేసి పాఠకులకు పంపిణీ చేసేవారు. ముస్లింలకు స్థానిక వార్తలు తెలియజేసే ఉర్దూ పత్రిక లేదని భావించి అజ్మతుల్లా ఈ పత్రికను స్థాపించారట. అప్పటి నుంచి చేతిరాతతోనే వార్తలను ప్రచురిస్తున్నారు. ఎంతో మంది పత్రికను మరింత అభివృద్ధి పర్చమని, టెక్నాలజీని ఉపయోగించమని చెప్పినా అజ్మతుల్లా తను ప్రారంభించిన చేతిరాత పద్ధతిలోనే పత్రికను కొనసాగించాలని సంకల్పించారు. 

మూడు తరాల సంపాదకులు

అజ్మతుల్లా మరణానంతరం ఆయన కుమారుడు ఫజుల్లా ఈ పత్రికకు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫజుల్లాకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అందరూ వివిధ వృత్తుల్లో స్థిరపడటంతో చేతిరాతతో ప్రచురించే ఈ పత్రిక తనతోనే అంతమైపోతుందని మదనపడుతూ 2008లో ఫజుల్లా కన్నుమూశారు. దీంతో అతడి కుమారుల్లో ఒకరైన ఆరిఫుల్లా తన తాత, తండ్రి నిర్వహించిన ఈ పత్రికను కొనసాగించడానికి ముందుకొచ్చారు. ఎంబీఏ పూర్తి చేసిన ఆరిఫుల్లా.. ఎన్నో ఉద్యోగావకాశాలు వదులేసుకొని సంస్థ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చీఫ్‌ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా చందాదారులు

ఈ పత్రికను ముస్లింలే కాదు.. ఉర్దూ వచ్చిన ఇతరులు కూడా చదువుతుంటారని ఆరిఫుల్లా వెల్లడించారు. ఈ ‘ది ముసల్మాన్‌’ ఉర్దూ పత్రిక రోజుకు 22వేల కాపీలు అమ్ముడుపోతున్నాయి. ఏడాది చందా ₹400 చెల్లించి.. ప్రతి రోజు ఈ పత్రికను పొందొచ్చు. కేవలం చెన్నైలోనే కాదు.. దేశవ్యాప్తంగా దిల్లీ, ముంబయి, కోల్‌కతాలోనూ ఈ పత్రికకు చందాదారులు ఉన్నారు. 94 ఏళ్లలో ఒక్క రోజు కూడా పత్రిక ప్రచురణను ఆపింది లేదట.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని