Khammam: కార్యకర్తలు సంయమనం పాటించాలి.. కృష్ణయ్య హత్య ఘటనపై తుమ్మల దిగ్ర్భాంతి

తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లి

Published : 16 Aug 2022 01:43 IST

ఖానాపురం హవేలి: ఖమ్మంలో తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య దారుణహత్యపై మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుప్రతికి వెళ్లి కృష్ణయ్య మృతదేహాన్ని పరిశీలించిన ఆయన.. కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆనాటి ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రను మార్చి అభివృద్ధి ఫలాలను అనుభవించే సమయంలో ఈ హత్య జరగడం బాధాకరమన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గత 30 ఏళ్లుగా హత్యారాజకీయాలకు జిల్లా దూరంగా ఉంది. కృష్ణయ్యను అత్యంత కిరాతకంగా చంపడం దారుణం. నిందితులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. కార్యకర్తలెవరూ ఆవేశపడొద్దు. ఎటువంటి దాడులకు పాల్పడవద్దు. హత్యా రాజకీయాలు జిల్లాకు మంచిది కాదు. వీటితో ప్రాంత అభివృద్ధి కుంటుపడుతుంది’’ అని తుమ్మల అన్నారు. అనంతరం చరవాణిలో మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి జరిగిన విషయాన్ని వివరించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లిలో తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, తెరాస నేత తమ్మినేని కృష్ణయ్య బైక్‌పై వెళ్తున్న సమయంలో దుండగులు ఆటోతో ఢీకొట్టారు. అనంతరం ఆరుగురు కృష్ణయ్యపై వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు. తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన జరిగింది. కృష్ణయ్య ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్‌గా ఉన్నారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. మరోవైపు కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమని తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్థులు ఆరోపించారు. దీంతో కోటేశ్వరరావు ఇంటిపై వారంతా దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు