మెదడు చురుకవ్వాలంటే ఇలా చేయండి

ఉదయం లేచినప్పుడు మనకుండే మానసిక స్థితిని బట్టే ఆ రోజు ఎలా ఉండబోతుందో తెలుస్తుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రశాంతమైన.. సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి. అప్పుడే ఆ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. కానీ, చాలా మందికి లేవగానే

Updated : 14 Feb 2021 15:46 IST

ఉదయం లేచినప్పుడు మనకుండే మానసిక స్థితిని బట్టే ఆ రోజు ఎలా ఉండబోతుందో తెలుస్తుందని మానసిక నిపుణులు చెబుతుంటారు. ప్రశాంతమైన.. సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించాలి. అప్పుడే ఆ రోజంతా సంతోషంగా గడిచిపోతుంది. కానీ, చాలా మందికి లేవగానే రోజువారీ పనులు, ఆర్థిక సమస్యలు మెదడును చుట్టేస్తాయి. రోజులో చేయబోయే, జరగబోయే వాటి గురించే ఆలోచిస్తూ ప్రశాంతతను దూరం చేసుకుంటారు. అలా కాకుండా ప్రతి రోజు లేవగానే ఈ చిట్కాలు పాటించి మెదడుకు సానుకూల సంకేతాలు పంపండి.. దీంతో ఆ రోజంతా మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.

ఉదయాన్నే పుస్తకాలు, వార్తాపత్రిక చదవండి

చాలామందికి లేవగానే వార్తాపత్రికలు చదివే అలవాటు ఉంటుంది. నిజానికి ఉదయాన్నే లేచి పత్రికలు చదువుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మెదడు మరింత చురుగ్గా ఉంటుంది. అంతేకాదు, మిమ్మల్ని గత విషయాలకు, జరగబోయే విషయాలకు దూరంగా తీసుకెళ్లి మెదడుకు ప్రశాంతత కల్పిస్తాయి. పత్రికలు చదివే అలవాటు లేనివారు ఏదైనా పుస్తకం చదవండి.


వ్యాయామంతో మెదడు చురుగ్గా..

వ్యాయామం శరీరానికి, ఆరోగ్యానికే కాదు.. మెదడుకూ మేలు చేస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. మెదడు చురుగ్గా ఉండటానికి కావాల్సిన పలు న్యూరోట్రాన్స్‌ మీటర్స్‌ వ్యాయామం చేయడం వల్ల విడుదలవుతాయి. అలాగే మెదడుకు తగినంత ఆక్సిజన్‌ రక్తం ద్వారా సరఫరా అవుతుంది. మెదడును గరిష్ఠ స్థాయిలో పనిచేసే విధంగా చేస్తుంది. తద్వారా మెరుగైన ఆలోచనలు, సత్వర నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.


ధ్యానం చేయండి

మనిషి భావోద్వేగాలు, భయాలు మెదడు కణాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. దీని వల్ల మెదడు పనితీరు నెమ్మదించడం, వాస్తవాలను అర్థం చేసుకోవడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో, స్పందించడంలో వెనుకబడటం లాంటివి జరుగుతాయి. ధ్యానం చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత పెరుగుతాయి. ధ్యానం చేసేవాళ్లు ఏ విషయాన్నైనా తొందరగా గుర్తుకు తెచ్చుకోగలరు.. నేర్చుకోగలరు.


సంగీతం వినండి

ఉదయం లేవగానే చక్కటి సంగీతాన్ని వినడం అలవాటు చేసుకోండి. మెదడులో ఎన్ని ఆలోచనలు ఉన్నా, ఎలాంటి పరిస్థితులున్నా సంగీతం మనిషి మానసిక స్థితిని మార్చేస్తుంది. సంగీతం వినే సమయంలో మెదడు డోపమైన్‌ను విడుదల చేస్తుంది. ఇది ఒత్తడిని తగ్గిస్తుంది. ఒకే విషయంపై ఏకాగ్రత పెంచుకోవచ్చు. అల్జిమర్స్‌ వంటి మెదడు సంబంధిత వ్యాధులను సైతం సంగీతం కొంతమేర నయం చేస్తుందట.


మెదడుకు మేత వేయండి

మెదడుకు శ్రమ కల్పించాలి.. అప్పుడే సరిగ్గా పనిచేస్తుందని పెద్దలు, నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే పదవినోదం, సుడోకు, పజిల్స్‌ వంటివి ఆడుతూ ఉండాలి. దీని వల్ల మెదడు పనితీరు క్రమంగా మెరుగవడం గమనించొచ్చని నిపుణులు చెబుతున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని