Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 26 Jul 2023 17:05 IST

1. అమెరికాలో ఆకలితో తెలంగాణ యువతి

అమెరికా (America)లో మాస్టర్స్‌ చేయాలని తెలంగాణ నుంచి వెళ్లిన ఓ మహిళ షికాగో (Chicago) రోడ్లపై ఆకలితో అలమటిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్‌కు తీసుకురావాలని అభ్యర్థిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖను భారాస నేత ఖలీకర్‌ రెహమాన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత

భాజపా తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీకి చెందిన నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీరుపై ఆ జిల్లా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలో బైఠాయించి ఎంపీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్వింద్‌ ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్‌, బాల్కొండ, బోధన్‌ మండలాలకు చెందిన కార్యకర్తలు నిరసన తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మూడు పెళ్లిళ్లు ప్రమాదమా? హత్యలు ప్రమాదమా?: సీపీఐ నారాయణ

ముఖ్యమంత్రి వద్ద పసలేకే పవన్‌ కల్యాణ్‌ పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ప్రమాదమా? ఇంట్లో బాబాయిని చంపితే ప్రమాదమా? అని పరోక్షంగా వివేకా హత్యను ప్రస్తావించారు. బాబాయిని చంపడం నేరం కాదని చెబుతారా? అని నిలదీశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సీమకు తీరని ద్రోహం.. ఆ పాపం జగన్‌దే: చంద్రబాబు

ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సాగునీటి ప్రాజెక్టులే ఓ ఉదాహరణ అని చెప్పారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు నాశనమైన తీరున ఆయన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వనమా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వు

తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వెళ్లేందుకు తనకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు అత్యవసర పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వు చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. గంటగంటకు గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు 44.4 అడుగుల మేర నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటిమట్టం మరో నాలుగు అడుగులు పెరిగి 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తే రూ.20వేల జరిమానా..’ క్లారిటీ ఇచ్చిన ఏపీ రవాణాశాఖ

‘‘ఇయర్ ఫోన్స్, హెడ్‌సెట్ పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తున్నారా.. అయితే మీకు రూ.20వేల జరిమానా..’’ అంటూ ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ ప్రకటించినట్లు గత రెండు రోజులుగా వాట్సాప్‌ సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో ఈ సమాచారం తెగ వైరల్‌ అవుతోంది. ఆగస్టు నెల నుంచి ఈ జరిమానా అమల్లోకి వస్తుందని పలు వాట్సప్‌ గ్రూపుల్లో వైరల్‌ కావడంతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గొంతుకోసి.. కారంపొడి చల్లి.. మహిళా డాక్టర్‌ దారుణ హత్య

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. మచిలీపట్నంలో పిల్లల వైద్య నిపుణురాలైన డాక్టర్‌ రాధ హత్యకు గురయ్యారు. నగరంలోని జవ్వారుపేట జంక్షన్‌లో నివాసముంటున్న డాక్టర్ ఉమామహేశ్వరరావు, రాధ దంపతులు చిన్నపిల్లల వైద్యులు. సొంతంగా ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. గత రాత్రి వారి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. రాధ గొంతు కోసి అతికిరాతకంగా చంపేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇద్దరు ఇండిగో పైలట్ల లైసెన్సులు సస్పెండ్‌ చేసిన డీజీసీఏ

ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్‌లో పనిచేసే ఇద్దరు పైలట్ల లైసెన్సులను విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ (DGCA) సస్పెండ్‌ చేసింది. గత నెలలో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమాన ల్యాండింగ్ సమయంలో తోక భాగం నేలను తాకిన ఘటనలో వీరిద్దరిపై చర్యలు తీసుకుంది. భద్రతా పరమైన నిబంధనలు పాటించనందువల్లే ఈ  ప్రమాదం చోటుచేసుకుందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఐటీపీఓలో మోదీ పూజలు.. శ్రమ జీవులకు సన్మానం

ప్రతిష్ఠాత్మక ‘జీ-20’ శిఖరాగ్ర సదస్సు (G-20 Summit)కు భారత్‌ సిద్ధమవుతోంది. దిల్లీ వేదికగా సెప్టెంబరులో జరగనున్న ఈ సమావేశానికి దేశాధినేతలు, పెద్దఎత్తున విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ప్రధాన వేదిక అయిన ‘ఐటీపీఓ కాంప్లెక్స్‌ (ITPO Complex)’ను ఆధునికీకరించింది. దీని ప్రారంభంలో భాగంగా ప్రధాన మోదీ(PM Modi) పూజలు నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని