Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 14 Jul 2023 09:00 IST

1. జాబ్‌ క్యాలెండర్‌ పక్కనపెట్టిన సీఎం జగన్‌

నిరుద్యోగులను ఊరిస్తూ ఉత్తుత్తి ప్రకటనలు చేయడంలో వైకాపా సర్కారుకు మరే ప్రభుత్వమూ సాటిరాదు. ఉద్యోగ నియామకాల క్యాలెండర్‌ జారీ చేస్తానని డాంబికాలు పలికిన ముఖ్యమంత్రి జగన్‌ ఆచరణలో మడమ తిప్పేశారు. కనీసం ప్రకటించిన పోస్టుల భర్తీకీ సకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వక ఘోరంగా విఫలమయ్యారు. ఏళ్లుగా మాటలతోనే కాలం గడిపేస్తుంటే.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయసు రీత్యా అర్హత కోల్పోతున్నామని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ నవీన్‌రావు

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు శుక్రవారం ఒక్కరోజు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే జస్టిస్‌ నవీన్‌రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టెట్‌ నిర్వహణకు 101 రోజులు

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణకు మొత్తం 101 రోజులు పడుతుందని విద్యాశాఖ అంచనా వేసింది. నోటిఫికేషన్‌ జారీ, ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేయడానికి, దరఖాస్తుల స్వీకరణకు, ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు 80 రోజులు పడుతుందని విద్యాశాఖ అధికారులు సర్కారుకు నివేదించారు. పరీక్ష ముగిసిన తర్వాత ఫలితాల వెల్లడికి 21 రోజులు కలిపి.. మొత్తం 101 రోజులు పడుతుందని అంచనా వేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉమ్మడి పౌరస్మృతిపై 50 లక్షల స్పందనలు

రాజకీయంగా అత్యంత సున్నితమైన అంశం...ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)పై గురువారం వరకు 50 లక్షల స్పందనలు లా కమిషన్‌కు చేరాయి. ఆన్‌లైన్‌లోనే కాకుండా హార్డ్‌కాపీలను లా కమిషన్‌ స్వీకరించిందని, దీంతో మొత్తం స్పందనల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఆన్‌లైన్‌ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసే గడువు శుక్రవారంతో ముగియనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టెస్లా కారు రూ.20 లక్షలకే!

చైనాలో తయారీ ప్లాంట్లు ఉన్న టెస్లా.. ఇపుడు మన దేశంలోనూ ప్లాంటు ఏర్పాటు చేసి ఇండో-పసిఫిక్‌ దేశాలకు విద్యుత్‌ వాహనాల(ఈవీ)ను ఎగుమతి చేయాలన్న ఉద్దేశంతో ఉందని తెలుస్తోంది. ఇందుకోసం ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని టెస్లా వేగంగానే అడుగులు వేస్తున్నట్లు,  ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. టెస్లా ఇక్కడ ఉత్పత్తి చేసే కార్ల ధరలు రూ.20 లక్షలతో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నేడు ప్రైవేటు డిగ్రీ కళాశాలల బంద్‌

ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకు వ్యతిరేకంగా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల సంఘం శుక్రవారం కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. కోర్సుల వారీగా ఫీజులను నిర్ణయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-22ను రద్దు చేయాలని, ఫీజులను పునఃసమీక్షించాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన బోధన రుసుములతో కళాశాలలు నిర్వహించడం కష్టమని, ఒక శాస్త్రీయ విధానమంటూ లేకుండా ఫీజులు నిర్ణయించారని సంఘం అధ్యక్షుడు గుండారెడ్డి విమర్శించారు.

7. 17న వీఐపీ బ్రేక్‌ దర్శనాల రద్దు

శ్రీవారి ఆలయంలో ఈ నెల 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దుచేసినట్లు తితిదే తెలిపింది. ఈ నెల 16న ఎటువంటి వీఐపీ సిఫారసు లేఖలు అనుమతించబోమని పేర్కొంది.

8. పార్లమెంటు ముందుకు 27 బిల్లులు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ భేటీల్లో మొత్తం 27 బిల్లులు చట్టసభల ముందుకు రానున్నాయి. వీటిలో 21 కొత్తవి కాగా...మిగిలిన ఆరు బిల్లులు ఇప్పటికే ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించినవి. తీవ్ర చర్చకు దారి తీసిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఈ జాబితాలో కనిపించలేదు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ట్రక్కు డ్రైవరుగా చేరిన సీఈవో

ఆస్ట్రేలియాకు చెందిన ఓ సినిమా హాళ్ల సంస్థ సీఈవో గ్రెగ్‌ రాస్‌ 60 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాన్ని వదిలిపెట్టి ట్రక్కు డ్రైవర్‌గా జీవితం ప్రారంభించారు. గత 12 ఏళ్లుగా ఇలాగే జీవనం సాగిస్తున్నారు. గ్రెగ్‌ రాస్‌ ఓ కార్ల సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నప్పుడు జీవితంలో ఏదో కోల్పోయానన్న అసంతృప్తి ఆయనలో పేరుకుపోయింది. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి సాధారణంగా, ఒత్తిడికి దూరంగా గడపాలనుకున్నాడు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మానవులకూ బర్డ్‌ఫ్లూ ముప్పు

కొంతకాలంగా క్షీరదాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు తరచూ వెలుగుచూస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. మానవులకూ సోకేలా అది రూపాంతరం చెందే ముప్పు లేకపోలేదంటూ హెచ్చరించింది. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు పక్షుల్లో వ్యాపిస్తాయి. అయితే వాటిలో ఒకటైన బర్డ్‌ఫ్లూ కారక హెచ్‌5ఎన్‌1 ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాను ఇటీవలి కాలంలో క్షీరదాల్లోనూ గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని