Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 26 Mar 2024 09:11 IST

1. రొట్టెలు చెయ్యండి.. రొయ్యలు ఒలవండి

ప్రపంచ స్థాయి కోర్సులన్నారు... అంతర్జాతీయ స్థాయి చదువులన్నారు... డిగ్రీలో మార్పులంటూ హడావుడి చేశారు... ఉపాధి ఆధారిత సిలబస్‌ అన్నారు... ఎన్నెన్నో గొప్పలు చెప్పారు...! ఆచరణలో జగనన్న రివర్స్‌ థియరీని అమలు చేశారు... ఇంటర్న్‌షిప్‌ పేరిట విద్యార్థులను హింసిస్తున్నారు... వారితో రొట్టెలు చేయిస్తున్నారు... రొయ్యల పొట్టు ఒలిపిస్తున్నారు... చెట్లెక్కిస్తాం, గుట్టలెక్కిస్తామని చెప్పి... పిల్లల భవితను అంగళ్ల పాలు చేశారు!! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘యాత్ర’ దర్శకుడికి స్థలం కేటాయింపుపై ఏపీ ప్రభుత్వం వెనక్కి

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లో ఓ సినీ దర్శకుడికి భూకేటాయింపుపై వైకాపా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని కొండపై రెండెకరాల భూమిని మినీ స్టూడియో కోసం కేటాయించాలన్న ఆలోచనను విరమించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చుక్కలను తాకుతున్న విద్యుత్‌ డిమాండ్‌

విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. వేసవి నేపథ్యంలో గృహ వినియోగంతోపాటు యాసంగి పంటలు సాగులో ఉన్నందున వాడకం అధికంగా ఉంది. నిరంతర సరఫరా కోసం రోజుకు రూ.40 కోట్లు వెచ్చించి తెలంగాణ డిస్కంలు అదనంగా భారత ఇంధన ఎక్స్ఛేంజ్‌(ఐఈఎక్స్‌)లో కరెంటును కొంటున్నాయి. ఒక్కోరోజు 8 కోట్ల యూనిట్లు అదనంగా కొంటేనే నిరంతర సరఫరా సాధ్యమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తప్పుడు పోస్టులు పెడితే కటకటాలే

సామాజిక మాధ్యమాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల సంఖ్య పెరిగింది. అభ్యర్థులు, పార్టీల అభిమానులు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం ప్రతి అంశంపైనా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రతి పోలీస్‌ కమిషనరేట్ పరిధిలో సైబర్‌ పెట్రోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. వీరు సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించి సుమోటోగా కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు: చంద్రబాబు

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, వైకాపా నాయకులు పేదల భూముల్ని లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక తొలిసారి చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గతమెంతో ఘనం.. ప్రస్తుతం ఒంటరి పథం!

దక్షిణ భారతంపై దృష్టి పెట్టిన భాజపా తమిళనాడులో వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌ సెల్వం(ఓపీఎస్‌)కు మద్దతు ప్రకటించింది.  ఒకప్పుడు సీఎం స్థాయికి ఎదిగి చక్రం తిప్పిన ఓపీఎస్‌ ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. భూముల రీసర్వే ఇప్పుడు వద్దు!

ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున భూముల రీసర్వే సాధ్యం కాదని జిల్లా అధికారులు ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నారు. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటోలు ముద్రించి ఉండడం, పొలాల సరిహద్దులో రాళ్లు పాతేందుకు రైతుల వ్యతిరేకత వ్యక్తమవుతున్నందున రీసర్వే కొనసాగించలేమని చేతులెత్తేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గనినాడులో గాలి ప్రభావమెంత?

లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించడానికి భాజపా పలు అస్త్రాలను ఉపయోగిస్తోంది. ఆ దారిలో భాగంగానే గాలి జనార్దన్‌ రెడ్డిపై అంటుకున్న అవినీతి మరకలు ప్రతిపక్షాలకు విమర్శ అస్త్రాలుగా మారే అవకాశాలు ఉన్నా..వాటిని లెక్కచేయకుండా పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భాజపాలోకి ఆహ్వానించింది. ఆయన భాజపాలో చేరికతో పార్టీకి లాభమా, కాదా అని సొంత పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆ రెండు గ్రామాలు గుర్తున్నాయా?

గత అయిదేళ్లలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా వెళ్లని గ్రామాలివి.. విద్యుత్తు కోసం లాంతర్లపై, తాగునీటి కోసం వాగుల్లోని చెలమలపై ఆధారపడి కాలం వెళ్లదీస్తున్న బతుకులివి.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వెంకటాపురం ప్రధాన రహదారి నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే బండారుగుంపు, రేగులగూడెం గ్రామాల్లో 77 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతి ఎన్నికల్లో వారు అయిదు కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ఇప్పటివరకు గెలుపొందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఆ గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు పరిష్కరించకపోవడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఏయూలో ‘రాజకీయ’ సమా‘వేషాలు’

విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) రాజకీయాలకు వేదికగా మారుతోందనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. వైకాపాలోని కీలక నేతలతో సన్నిహిత సంబంధాలున్న వీసీ ప్రసాదరెడ్డి.. విశ్వవిద్యాలయాన్ని రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చుకోవడం విస్తుగొలుపుతోంది. గత ఎన్నికల్లో వైకాపా కోసం పని చేసిన ఆయన.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆ పార్టీ కోసం వివిధ మార్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. ఆయనను ఇలాంటి కార్యకలాపాలకు వినియోగించుకునేందుకే వీసీగా మరోసారి అవకాశమిచ్చారని అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు