కూరెళ్ల గ్రంథాలయం వల్ల వెల్లంకికే రాజ్‌భవన్‌ వచ్చింది: గవర్నర్‌ తమిళిసై

డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయాల ద్వారా రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. 

Published : 19 Feb 2024 21:13 IST

భువనగిరి: డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్య గ్రంథాలయాల ద్వారా రాబోయే తరాలకు పుస్తకాలను అందించడం గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమవారం రామన్నపేట మండలం వెల్లంకిలో ఆచార్య కూరెళ్ల గ్రంథాలయ భవనాన్ని గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో పనులు ఉన్నా గ్రంథాలయాన్ని ప్రారంభించాలనే వచ్చానని చెప్పారు. ఇవాళ ఈ గ్రామానికే రాజ్‌భవన్‌ వచ్చిందన్నారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో వెల్లంకి గ్రామాన్ని, ఆచార్య కూరెళ్ల గ్రంథాలయాన్ని ప్రస్తావించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ‘పుస్తకాలు మంచి ప్రపంచాన్ని సృష్టిస్తాయి. సమాజంలో ఉన్నత స్థానం కల్పిస్తాయి. పోటీ పరీక్షలకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి’ అని యువతకు సూచించారు. 

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కోనూరు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ గ్రంథాలయాల పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తున్నారని..  కూరెళ్ల గ్రంథాలయానికి 8,500 పుస్తకాలు, వెయ్యి నోటు బుక్స్‌ అందజేస్తున్నారని తెలిపారు. గ్రంథాలయానికి మంజూరు చేసిన రూ.10.63 లక్షలకు సంబంధించిన పత్రాలను కూరెళ్ల విఠలాచార్యకు గవర్నర్‌ అందజేశారు. గ్రంథాలయ ప్రారంభోత్సవంలో గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ హనుమంతుకే జెండగే, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జి.వీరారెడ్డి, పలువురు అధికారులు, కవులు, రచయితలు, సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని