Communication Skill: కొత్తవారితో మాటలు కలపండిలా..!

విజయ్‌.. తను ఉండే కాలనీలోనే ఒక అమ్మాయిని తెగ ఇష్టపడుతున్నాడు. ఆమె వెళ్లే ప్రతి చోటుకూ వెళ్తుంటాడు. కానీ ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. కొత్త అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి?

Updated : 10 Nov 2021 09:33 IST

విజయ్‌.. తను ఉండే కాలనీలోనే ఒక అమ్మాయిని తెగ ఇష్టపడుతున్నాడు. ఆమె వెళ్లే ప్రతి చోటుకూ వెళ్తుంటాడు. కానీ ఆమెతో ఒక్కమాట కూడా మాట్లాడలేకపోతున్నాడు. కొత్త అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి? ఎలా మాట్లాడాలో తెలియక తనలో తానే మథనపడుతున్నాడు.

ప్రియ.. తను పనిచేసే ఆఫీసులోనే సహోద్యోగిని ప్రేమిస్తోంది. ఆ విషయం చెప్పాలంటే అసలు ఆయనతో మాట్లాడాలి కదా..! మాట్లాడే ధైర్యం ఉన్నా.. ఏం మాట్లాడాలో అర్థంకాక తికమకపడుతోంది. ఒక్కసారి మాటలు మొదలైతే వారి మధ్య మౌనం మాయమవుతుంది. కానీ ఆ మాటలు మొదలుపెట్టడం ఎలా? ఇలాంటి సమస్యనే చాలామంది ఎదుర్కొని ఉంటారు. నచ్చిన వ్యక్తులతో మాట్లాడాలని ఉన్నా.. మాట్లాడలేక లోలోపలే సంఘర్షణకు గురవుతుంటారు. అలాంటి వాళ్లు.. ఈ చిట్కాలను పాటిస్తూ.. మాటలు కలపండి. పరిచయం దానంతట అదే జరిగిపోతుంది.

వస్త్రధారణపై.. 

ఇద్దరూ కలిసి ఒకేచోట కూర్చున్నారనుకోండి.. ఎదుటివ్యక్తి వస్త్రధారణను పొగడండి. ధరించిన దుస్తులు, వాచ్‌, షూ ఏదైనా.. అవి చాలా బాగున్నాయని ప్రశంసించండి. దుస్తుల బ్రాండ్‌ లేదా కొనుగోలు చేసిన ప్రాంతం గురించి అడగండి. మీకు నచ్చే దుస్తుల డిజైన్‌ గురించి చెప్పండి. ఫ్యాషన్‌ దుస్తులపై అభిప్రాయాల్ని తెలపండి.

వాతావరణం గురించి..

కాఫీ షాపులోనో, పార్కులోనో కలిస్తే.. బయటి వాతావరణం గురించి మాట్లాడండి. వర్షం పడితే.. వర్షంతో మీకున్న తీపి గుర్తులను చెప్పండి. ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా వెళ్తారు వంటి ప్రశ్నలు వేయండి. తద్వారా వారిపై మీరు శ్రద్ధ చూపుతున్నారనే విషయం వారికి అర్థమవుతుంది. వాతావరణానికి అనుకూలమైన ఆహార పదార్థాలను లేదా అక్కడి ప్రత్యేక వంటకాలను ఆర్డర్‌ ఇచ్చి ఎదుటివ్యక్తిని ఆకట్టుకోవచ్చు.

ఒక్క మాటతో తేల్చే ప్రశ్నలు వద్దు

మాట్లాడడం మొదలుపెట్టాక ఎదుటివారి గురించి తెలుసుకోవడం కోసం అనేక ప్రశ్నలు వేస్తుంటాం. అయితే అలా అడిగే ప్రశ్నలు సంభాషణను తొందరగా ముగించేలా ఉండకుండా చూసుకోవాలి. మీ ప్రశ్న.. ఒక్క మాట సమాధానంతో పూర్తయిపోకుండా సంభాషణను పొడిగించేలా ఉండాలి. ప్రశ్న వేస్తే వచ్చే సమాధానంతోనే అనేక ప్రశ్నలు అల్లుకుంటూ పోవాలి. దీంతో ఎక్కువ సేపు మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది.

సాధారణ అంశాలపై చర్చ

రోజువారీ జీవితంలో ఎన్నో అంశాలు కామన్‌గా ఉంటాయి. వార్తలు కావొచ్చు.. చుట్టుపక్కల జరిగే ఘటనలు కావొచ్చు లేదా ఇతర వ్యక్తిగత ఆసక్తులు కావొచ్చు. వాటిపై అందరూ చర్చిస్తుంటారు. మీరున్న సందర్భాన్ని బట్టి ఓ అంశాన్ని లేవనెత్తండి. దాని గురించి ఇరువురూ చర్చించండి. వాదనలకు వెళ్లకుండా చర్చ సరదాగా ఉండేలా చూసుకోండి. దీంతో మీలోని విశ్లేషణ నైపుణ్యం, అంశాలపై అవగాహన ఎదుటివారిని ఆకట్టుకునే అవకాశముంది. దీనివల్ల సంభాషణ పెరగడమే కాదు.. ఆకట్టుకోవడం అదనంగా వచ్చే లబ్ధి. ఇలా మాటలు కలిపి పరిచయం పెంచుకోవచ్చు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని