
తెల్ల బియ్యమా? దంపుడు బియ్యమా?
అన్నం తినకపోతే కడుపు నిండినట్టే ఉండదు. చాలామంది నోట వినిపించే మాట ఇది. అవును. మనదగ్గరే కాదు, ప్రపంచంలో చాలాచోట్ల అన్నమే ప్రధాన ఆహారం. అందరికీ అందుబాటులో ఉండేదీ, చవకైనదీ ఇదే. కూరలైనా, చారైనా, పెరుగైనా.. దేంతోనైనా కలిసిపోయి ఆయా వంటకాల రుచులను మరింత పెంచుతుంది. అందుకే అన్నమంటే అంత ఇష్టం. ఇప్పుడంతా మల్లెపూవులా మెరిసే తెల్ల అన్నాన్నే ఇష్టపడుతున్నారు గానీ ఒకప్పుడు ఎక్కువగా దంపుడు బియ్యమే తినేవారు. మన తాత, ముత్తాతలు బలంగా, జబ్బుల బాధలేవీ లేకుండా ఆరోగ్యంగా ఉండటానికిదే కారణమని చెప్పుకోవటం వింటూనే ఉంటాం. అందుకేనేమో తెల్ల బియ్యం మంచివా? దంపుడు బియ్యం మంచివా? అనే సందేహం ప్రతి మదినీ తొలుస్తుంటుంది. మధుమేహం వంటి జబ్బులు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో దీనిపై చర్చ మరింత ఎక్కువైంది కూడా.
దంపుడు బియ్యంలో పోషకాలు మెండు
తెల్ల బియ్యం, దంపుడు బియ్యం రెండింట్లోనూ పిండి పదార్థం ఉంటుంది. కొద్దిగా ప్రొటీన్ కూడా లభిస్తుంది. కొవ్వు అసలే ఉండదు. తెల్ల బియ్యానికీ దంపుడు బియ్యానికీ ప్రధానమైన తేడా తవుడు. దంపుడు బియ్యం, ఒక పట్టు బియ్యం తవుడుతో కూడుకొని ఉంటుంది. ఇందులో గింజకు సంబంధించిన అన్ని పోషకాలూ ఉంటాయి. తవుడుతో కూడిన పొరలోనే పీచు, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల వంటివి ఉంటాయి. అదే తెల్ల బియ్యమైతే లోపలి గింజ మాత్రమే ఉంటుంది. పోషకాల పాళ్లు తక్కువ. ముఖ్యంగా పీచు దాదాపు ఉండదనే అనుకోవచ్చు. వంద గ్రాముల దంపుడు బియ్యంతో 1.8 గ్రాముల పీచు లభిస్తే తెల్లబియ్యంతో కేవలం 0.4 గ్రాములే అందుతుంది. మిగతా పోషకాల విషయానికి వస్తే- 100 గ్రాముల దంపుడు బియ్యంలో థయమిన్ 6%, నియాసిన్ 8%, విటమిన్ బి6 7%, మాంగనీస్ 45%, మెగ్నీషియం 11%, ఫాస్ఫరస్ 8%, ఐరన్ 2%, జింక్ 4% ఉంటాయి. అదే 100 గ్రాముల తెల్ల బియ్యంలోనైతే థయమిన్ 1%, నియాసిన్ 2%, విటమిన్ బి6 5%, మాంగనీస్ 24%, మెగ్నీషియం 3%, ఫాస్ఫరస్ 4%, ఐరన్ 1%, జింక్ 3% మాత్రమే ఉంటాయి. దంపుడు బియ్యంలో పోషకాలు మెండుగా ఉంటాయనటానికిదే నిదర్శనం.
దంపుడు బియ్యంతో మధుమేహం ముప్పు తక్కువ
దంపుడు బియ్యంలో దండిగా ఉండే మెగ్నీషియం, పీచు రక్తంలో గ్లూకోజు స్థాయులు నియంత్రణలో ఉండటానికి తోడ్పడతాయి. క్రమం తప్పకుండా దంపుడు బియ్యం వంటి నిండు గింజ ధాన్యాలు తినేవారికి మధుమేహం ముప్పు 31% తక్కువని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే తెల్ల బియ్యం ఎక్కువగా తినేవారికి మధుమేహం ముప్పు పెరుగుతోందనీ వివరిస్తున్నాయి. దీనికి మూలం తెల్లబియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండటం. రక్తంలో గ్లూకోజు ఎంత వేగంగా కలుస్తోందనే దాన్ని జీఐతో సూచిస్తారు. దంపుడు బియ్యం జీఐ 50 కాగా.. తెల్లబియ్యం జీఐ 89. రక్తంలో గ్లూకోజు వేగంగా కలిసేలా చేసే పదార్థాలతో మధుమేహం వంటి రకరకాల జబ్బుల ముప్పులు పెరుగుతాయి.
దంపుడు బియ్యంతో గుండెజబ్బు ముప్పు తక్కువ
దంపుడు బియ్యంలో లిగ్నాన్లనే వృక్ష రసాయనాలుంటాయి. ఇవి రక్తంలో కొవ్వు మోతాదును, రక్తపోటును తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కణస్థాయిలో జరిగే వాపు ప్రక్రియ తగ్గటానికీ తోడ్పడతాయి. దంపుడు బియ్యం వంటి నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా తినేవారికి గుండెజబ్బుల ముప్పు 16-21% తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. నిండు గింజ ధాన్యాలు చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటంలోనే కాదు, మంచి కొలెస్ట్రాల్ పెరగటంలోనూ తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, మంచి కొలెస్ట్రాల్ తగ్గితే గుండెజబ్బు ముప్పు పెరుగుతుందన్నది తెలిసిందే. దంపుడు బియ్యం తవుడులో శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి గుండెజబ్బు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాల జబ్బుల నివారణకు దోహదం చేస్తాయి.
దంపుడు బియ్యంతో బరువు అదుపు
తెల్ల బియ్యానికి బదులు దంపుడు బియ్యం తినటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. ఇవి బరువు, శరీర ఎత్తు-బరువుల నిష్పత్తి (బీఎంఐ), నడుం, తుంటి చుట్టుకొలత తగ్గటానికి తోడ్పడతాయి. నిండు గింజ ధాన్యాలు తక్కువగా తినేవారితో పోలిస్తే వీటిని క్రమం తప్పకుండా తినేవారు తక్కువ బరువుతో ఉంటున్నట్టు 12 ఏళ్ల పాటు నిర్వహించిన ఒక అధ్యయనం పేర్కొంటోంది. అలాగే అధిక బరువు, ఊబకాయ మహిళల్లో బరువుతో పాటు తుంటి చుట్టుకొలతా తగ్గటం గమనార్హం.
ఏవైనా మితంగానే..
దంపుడు బియ్యంలో పోషకాలు, లాభాలు ఎక్కువగా ఉన్నమాట నిజమే అయినా వీటితో కొన్ని నష్టాలు లేకపోలేదు. చిత్రంగా దంపుడు బియ్యంలో ఫైటిక్ యాసిడ్, ఫైటేట్ల వంటి విరుద్ధ పోషకాలూ ఉంటాయి. ఇవి ఐరన్, జింక్ వంటి పోషకాలను శరీరం గ్రహించుకోకుండా అడ్డుపడతాయి. దంపుడు బియ్యంలో ఆర్సెనిక్ అనే విషతుల్య రసాయనమూ ఎక్కువగానే ఉంటుంది. ఆర్సెనిక్‌ను చాలాకాలంగా తీసుకుంటే దీర్ఘకాల జబ్బులు తలెత్తే అవకాశముంది. అంటే దంపుడు బియ్యం, తెల్లబియ్యం రెండింటితోనూ కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు ఉంటున్నాయన్నమాట. మరెలా అని చింతించకండి. ఏ బియ్యాన్నయినా మితంగా తీసుకోవటం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. కొన్నిసార్లు దంపుడు బియ్యం, కొన్నిసార్లు తెల్ల బియ్యం.. ఇలా మార్చి మార్చి తినటం ద్వారా రెండింటి లాభాలనూ పొందొచ్చు.
ఇవీ చదవండి
ప్రశాంత జీవితానికి పంచ సూత్రాలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్ 284 ఆలౌట్.. టీమ్ఇండియాకు భారీ ఆధిక్యం
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
-
Politics News
Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
World News
Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!
-
Politics News
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి