సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?

Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది.

Updated : 13 Feb 2024 20:24 IST

-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్

ఫిబ్రవరి 14న వసంత పంచమి

సరస్వతి ఒక వ్యక్తి కాదు.. జడత్వం, నిర్జీవం అనే మాటే లేకుండా ఎల్లప్పుడూ ఉత్సాహంతో నిండి ఉండే ఆత్మస్వరూపమే. మన జీవితంలోని ఉత్సాహమే సరస్వతి. ఆమె జ్ఞాన, గాన, ధ్యానాలు మూర్తీభవించిన స్వరూపం. నేను ఎవరో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించేది సరస్వతి. విద్యకు, జ్ఞానానికి అధి దేవత అయిన సరస్వతి రూపం, ఆ భావన ప్రపంచంలోనే అసమానమైనది. ఎందుకో మీకు తెలుసా?

ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. వీణావాద్యం (సంగీతం) మన కుడి మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఆమె మరొక చేతిలో జపమాల కనిపిస్తుంది. అది జీవితంలోని ధ్యాన గుణాన్ని సూచిస్తుంది.

గాన (సంగీతం), జ్ఞాన (మేధో జ్ఞానం) ధ్యాన (ధ్యానం). ఈ మూడూ కలిగి ఉన్నపుడే విద్య పరిపూర్ణం అవుతుంది. ఈ మూడింటిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారినే విద్యావంతులు లేదా నాగరికులు అని పిలవగలం. కాబట్టి పిల్లలు సంగీతం, యోగా నేర్చుకునేలా మనం శ్రద్ధ వహించాలి. అదే సమయంలో వారికి శాస్త్ర, వైజ్ఞానిక దృక్పథం కూడా ఉండేలా చూడాలి. వారు పెద్దవారు అవుతున్న కొద్దీ వారిని ప్రశ్నలు అడిగేలా ప్రోత్సహించాలి. తద్వారా వారిలో విషయాలను తెలుసుకునే ఆసక్తిని, వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించగలుగుతారు.

సరస్వతి వాహనం హంసగా పేర్కొంటారు. పాలు, నీళ్లు కలిపి పెడితే హంస అందులోని నీటిని వేరు చేసి పాలు మాత్రమే తాగుతుందని చెబుతారు. ఇది విచక్షణాశక్తిని (వివేకాన్ని) సూచిస్తుంది. దీన్ని ఉపయోగించి మనం జీవిత అనుభవాల్లో సానుకూలమైన పాఠాలను తీసుకుని, ప్రతికూలమైన వాటిని వదిలివేస్తాం. సరస్వతీదేవిని అనుసరించి నెమళ్ళు ఉండడం మీరు గమనించండి. నెమళ్లు వర్షం వచ్చేముందు మాత్రమే పురివిప్పి నాట్యం చేస్తాయి. ఎప్పుడు పడితే అప్పుడు చేయవు. సరైన జ్ఞానాన్ని, సరైన చోట, సరైన సమయంలో ప్రదర్శించే సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది.

వివిధ రకాల జ్ఞాన సాధనలు వెల్లివిరిసే చైతన్య స్వరూపమే సరస్వతి. ఆమె ఆధ్యాత్మిక జ్యోతికి మూలం. అన్ని అజ్ఞానాలను తొలగించేది. అన్ని జ్ఞానాలకు మూలం ఆమె. ఆ తల్లి వీణ వాయిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. మానవ జీవితానికి, సరస్వతీ మాత వీణ వాయించడానికి సంబంధం ఏమిటి? అనే సందేహం రావొచ్చు. వీణ మానవ శరీరాన్ని సూచిస్తుంది. వీణకు 7 తీగలు ఉన్నట్లే, మన శరీరం కూడా ఏడు ధాతువులతో రూపొందింది. వీణను సరిగ్గా శ్రుతి చేస్తే.. దాని నుంచి వినిపించే సంగీతం చెవులకు మధురంగా ​​ఉంటుంది. అదే విధంగా జీవితాన్ని చక్కగా శ్రుతిచేస్తే కలిగేది దివ్యానుభూతి, పరమానందం.

అనేక విద్యాసంస్థల్లో సరస్వతీ దేవి విగ్రహాన్ని మీరు చూడొచ్చు. ఆమె సంపూర్ణమైన విద్యాభ్యాసాన్ని సూచిస్తుంది. భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది విద్య నుంచి ఎప్పుడూ దూరంగా లేదు. సరస్వతీదేవి ఒక రాతిపై కూర్చొని ఉన్నట్లు చూపుతారు. జ్ఞానం అనేది మీకు రాయివంటి నిశ్చలత్వాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. అది కదలిపోతూ, ఊగుతూ ఉండదు. స్థిరంగా ఉంటుంది. నెమలి సౌందర్యాన్ని, ఉత్సవాన్ని సూచిస్తుంది. ఏ జ్ఞానమైనా మీలో అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించాలి. ఆధ్యాత్మికత అనేది అన్నింటినీ కలుపుకొని ఉంటుంది. ఆత్మాభివృద్ధికి సహాయపడేది ఏదైనాసరే.. అది ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికతలో భాగంగా మనం స్వాధ్యాయం (శాస్త్రీయ జ్ఞానం), ఆత్మ జ్ఞానం రెండూ నేర్చుకుంటాం. యోగాసనాలు వేస్తాం.. ధ్యానం కూడా చేస్తాం. అంటే బుద్ధితో కూడిన జ్ఞానం, సంగీతం, కళలు, సంస్కృతి, నాట్యం, ధ్యానం ఇవన్నీ ఆధ్యాత్మికతలో భాగాలే. ఇవన్నీ సరస్వతీదేవి స్వరూపంలో మనకు కనిపిస్తాయి. ఈ భాగాల్లో ఏ ఒక్కటి లేకున్నా, ఆ విద్య పరిపూర్ణం అని చెప్పలేం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని