ఇదీ.. జనవరి 1 వెనకున్న కథ!

ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు ప్రజలు మార్చి/ఏప్రిల్‌ నెలలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. అలాగే నేపాల్‌లో దీపావళి వేడుకల్లో నాలుగో రోజు అయిన ‘మా పూజ’ను నేపాలీ కాలెండర్‌ ప్రకారం నూతన

Updated : 01 Jan 2021 13:06 IST

ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు ప్రజలు మార్చి/ఏప్రిల్‌ నెలలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. అలాగే నేపాల్‌లో దీపావళి వేడుకల్లో నాలుగో రోజు అయిన ‘మా పూజ’ను నేపాలీ క్యాలెండర్‌ ప్రకారం నూతన సంవత్సరం తొలిరోజుగా జరుపుకొంటారు. చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటాయి. ఇలా చాలా దేశాలు వారి దేశీయ సంప్రదాయం ప్రకారం ఇతర నెలల్లో, తేదీల్లో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాయి. అయినా, అన్ని దేశాల్లో జనవరి 1వ తేదీనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఎందుకలా? ఈ రోజునే నూతన సంవత్సర వేడుకలు ఎందుకు? తెలుసుకుందాం పదండి..

మొదట్లో జనవరి నెలే లేదు..

నూతన సంవత్సరం జరుపుకోవడం కొత్తేమీ కాదు. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాలు అంటే.. 4వేల సంవత్సరాల కిందటి నుంచే నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. నిజానికి ప్రపంచమంతా ఏటా మార్చి నెలలో వసంత కాలం ప్రారంభమైన నాటి నుంచే కొత్త ఏడాదిగా పరిగణించేవారు. అయితే, అదే సమయంలో రోమ్‌ సామ్రాజ్యం పది నెలలతో కూడిన రోమ్‌ క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ క్యాలెండర్‌లో తొలి నెల మార్చిగా ఉండటంతో మార్చి1ని నూతన సంవత్సరంగా జరుపుకోవడం మొదలుపెట్టారు.

మార్చికి ముందు వచ్చి చేరిన జనవరి.. ఫిబ్రవరి

అయితే క్రీస్తుపూర్వం 700 కాలంలో రోమ్‌ రెండో చక్రవర్తి నుమా పొంటిలియస్‌ జనవరి, ఫిబ్రవరి నెలలను అప్పటికే ఉన్న రోమ్‌ క్యాలెండర్‌కు జతచేసి 12 నెలలున్న క్యాలెండర్‌ను రూపొందించారు. తన సామ్రాజ్యంలో నియమితులైన ప్రజాప్రతినిధులు, అధికారుల పదవీకాలాలను జనవరి 1 నుంచి లెక్కగట్టేవారు. జనవరి 1ని కేవలం అధికారుల పదవీ కాలపరిమితిని లెక్కించడానికి మాత్రమే పరిగణనలోనికి తీసుకునేవారు. నూతన సంవత్సర వేడుకల్ని మాత్రం మార్చి ఒకటినే నిర్వహించేవారు.

జనవరి 1న నూతన సంవత్సరం

కాల క్రమంలో రోమ్‌ ప్రజలు జనవరి 1ని నూతన సంవత్సరం తొలిరోజుగా గుర్తించడం మొదలుపెట్టారు. తొలిసారి క్రీ.పూ 153లో నూతన సంవత్సరం వేడుకలు జనవరి 1న జరిగాయి. అయినా నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్నతోపాటు.. సూర్యచంద్రుల గమనంతో.. అప్పటి క్యాలెండర్‌ తేదీలు సరితూగకపోవడంతో వాటి లెక్కలు సరిచేసి క్రీ.పూ 46లో జూలియస్‌ సీజర్‌.. జూలియన్‌ క్యాలెండర్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్‌ అనే రోమ్‌ దేవుడి పేరు మీదుగా వచ్చింది. అందుకే జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్‌ అధికారికంగా ప్రకటించారు.

డిసెంబర్‌ 25కు మార్పు

క్రీస్తుశకం వచ్చాక యూరప్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. యూరప్‌లో క్రైస్తవ ప్రభావం పెరగడంతో 567లో అప్పటి దేశ పాలకులు జనవరి 1ని నూతన సంవత్సరంగా తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్‌ 25నుంచి కొత్త ఏడాది ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు. 

మళ్లీ జనవరి 1కి..

జూలియన్ క్యాలెండర్‌లోనూ పలు లోపాలను గుర్తించిన పోప్‌ గ్రెగొరీ-XIII.. వాటికి స్వల్ప మార్పులు చేస్తూ 1582లో గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన క్యాలెండర్‌ ఆమోదయోగ్యంగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటుపడి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించాయి. అయితే, బ్రిటన్‌ మొదట్లో గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను అనుసరించడానికి ఇష్టపడలేదు. అందుకే జనవరి 1 కాకుండా.. మార్చి 1న కొత్త ఏడాది వేడుకలు జరుపుకునేది. కాలక్రమంలో ప్రపంచ దేశాలు, బ్రిటన్‌ మధ్య తేదీల్లో తేడాలు రావడం, వాణిజ్యపరంగా ఇబ్బందులు మొదలు కావడంతో 1752లో బ్రిటన్‌ సామ్రాజ్యం కూడా గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ను అమలు చేసి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంది. ఇదీ జనవరి 1 వెనకున్న కథ..!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి..

విందామా..! నవ వసంతానికి మోదీ కవిత

కొత్త ఏడాదిలో కలిసికట్టుగా ముందుకు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని