ప్యాంట్‌ జిప్‌పై ‘YKK’ని గమనించారా?

మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్‌ దుస్తులు అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు మీరూ వాటిని వేసుకొనే ఉంటారు. అయితే, అనేక బ్రాండ్‌ దుస్తుల్లో ప్యాంటు జిప్‌పై YKK అనే అక్షరాలు కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? బ్రాండ్లు వేరయినా జిప్‌పై ఆ అక్షరాలే

Updated : 26 Oct 2020 11:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్‌ దుస్తులు! చాలామంది వాటిని చూసుంటారు. వేసుకునీ ఉంటారు. మీకు గుర్తుంటే, అనేక బ్రాండ్‌ దుస్తుల్లో ప్యాంటు జిప్‌పై YKK అనే అక్షరాలు కనిపిస్తాయి. మీరెప్పుడైనా గమనించారా? బ్రాండ్‌లు వేరయినా జిప్‌పై ఆ అక్షరాలే ఎందుకుంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి సమాధానం ఇదిగో..

YKK అంటే ‘యొషిదా కొంగ్యో కుబుషికిగైషా (యోషిదా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌)’. నోరు తిరగకపోయినా పర్లేదు. మనకు పేరు ముఖ్యం. జపాన్‌కు చెందిన టాడావో యోషిదా 1934లో దీనిని స్థాపించారు. 71 దేశాల్లో 109 యూనిట్లు కలిగి ఉన్న ఈ సంస్థ నుంచే ప్రపంచవ్యాప్తంగా 90శాతం జిప్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ కంపెనీ కేవలం జిప్పర్స్‌నే కాదు.. జిప్‌లను తయారు చేసే యంత్రాలను సైతం తయారు చేస్తోంది. జార్జియాలో YKKకి రోజుకి 70 లక్షల జిప్‌లు ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీ ఉంది. 1966లో ప్రస్తుతం జీన్స్‌ ప్యాంట్లకు ఉండే Y జిప్‌లను ఈ సంస్థే ఆవిష్కరించింది. ప్యాంటును కుట్టే మెషీన్‌లోనే ఈ జిప్‌ను కుట్టే పరికరాన్నీ అమర్చడంతో జీన్స్‌ ఉత్పత్తి, అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.

1968లో జపాన్‌ దాటి కెనడాలో తొలిసారి YKK తన శాఖను ఏర్పాటు చేసింది. నాణ్యమైన జిప్‌లను తయారు చేస్తుండటంతో కంపెనీ వెనక్కితిరిగి చూసుకోలేదిక. అనేక దేశాల్లో శాఖలు విస్తరింపజేసి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంది. ఈ సంస్థకు చాలా కాలం పాటు పోటీనే లేదు. ప్రస్తుతం ఈ కంపెనీకి పోటీగా పలు సంస్థలొచ్చినా.. ఇప్పటికీ జీన్స్‌ ప్యాంట్ల జిప్‌లు ఈ కంపెనీవే ఉంటాయి. జిప్‌లతోపాటు ఇప్పుడు ఈ సంస్థ దుస్తులు, బ్యాగులు, ఇతర ఫ్యాషన్‌ సంబంధిత వస్తువులను ఉత్పత్తి చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని