YSRCP: కోటయ్య కుటుంబంపై మరోసారి వైకాపా నేత దాడి

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో కోటయ్య కుటుంబంపై మరోసారి దాడి జరిగింది.

Updated : 05 Aug 2023 14:13 IST

వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో కోటయ్య కుటుంబంపై మరోసారి దాడి జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆగ్రహంతో తెదేపా సానుభూతిపరుడు కోటయ్య కుటుంబంపై వైకాపాకు చెందిన ఉప సర్పంచి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శనివారం మరోసారి దాడికి దిగారు. ఈ ఘటనలో కోటయ్య తలకు తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా తమపై దాడి జరుగుతున్నా.. పోలీసులు కేసు నమోదు చేయడం లేదని బాధితులు వాపోయారు.

ఆడవాళ్లు అని చూడకుండా..

కోటయ్య కుటుంబానికి, వైకాపా ఉప సర్పంచి కృష్ణమూర్తి కుటుంబానికి కొన్నాళ్లుగా విభేదాలున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కోటయ్యకు చెందిన పశువుల కొట్టంలోకి కృష్ణమూర్తి ఎద్దు వచ్చింది. దీనిపై కోటయ్య భార్య మల్లీశ్వరి కృష్ణమూర్తిని అడిగారు. ఆమెపై కృష్ణమూర్తి కుటుంబసభ్యులు దాడి చేశారు. మల్లీశ్వరి కుమార్తెలు సౌజన్య, సునీత అడ్డుగా వచ్చి మా అమ్మను కొట్టొదని ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ కనికరించకుండా ముగ్గురు మహిళలపై కృష్ణమూర్తి కుటుంబసభ్యులు నలుగురు పురుషులు, ఒక మహిళ కలిసి మూకుమ్మడిగా దాడి చేశారు. ఆడవాళ్లు అని చూడకుండా చావబాదారు. కృష్ణమూర్తి కుటుంబసభ్యుల్లో ఒకరు సునీత జుట్టుపట్టుకుని తలను సిమెంట్‌ రోడ్డు కేసి కొట్టడంతో బాలిక చలనం లేకుండా పడిపోయింది. దీనిని చూసి చనిపోయిందేమోనని భావించి అక్కడి నుంచి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. సునీత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇంతలో పోలీసులకు ఫిర్యాదు చేశారనే ఆగ్రహంతో కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు శనివారం మరోసారి దాడి చేయడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు